ఉత్తరాంధ్రలో చంద్రబాబునాయుడుకు పెద్ద షాక్ తగిలింది. విశాఖపట్నంలో కీలక నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి సోదరుడు చింతకాయల సన్యాసిపాత్రుడు తెలుగుదేశంపార్టీకి రాజీనామా చేశారు. అయ్యన్న 4 దశాబ్దాల రాజకీయ ఎదుగుదల వెనుక సన్యాసిపాత్రుడి కృషి చాలానే ఉంది. అయ్యన్నపాత్రుడు ఎంఎల్ఏ అయినా మంత్రి అయినా నర్సీపట్నం నియోజకవర్గాన్ని చూసుకున్నది సన్యాసిపాత్రుడే అన్న విషయం అందరికీ తెలిసిందే.

 

నర్సీపట్నం మున్సిపల్ ఛైర్మన్ గా పనిచేసిన సన్యాసిపాత్రడికి సోదరుడితో విభేదాలు తీవ్రస్ధాయికి చేరుకుంది. వీళ్ళిద్దరి మధ్య గొడవలు చాలా కాలంగానే ఉన్నప్పటికీ మొన్నటి ఎన్నికల సమయంలో తారస్ధాయికి చేరుకుంది. అయ్యన్నపాత్రుడి బలమంతా సన్యాసిపాత్రుడి బలమనే చెప్పాలి.

 

ఎప్పుడైతే అయ్యన్నపాత్రుడి కొడుకు రాజకీయంగా అంది వచ్చాడో అప్పటి నుండో సోదరుల మధ్య గొడవలు మొదలయ్యాయి. కొడుకు చిన్నవాడుగా ఉన్నపుడు సన్యాసిపాత్రుడి నిర్ణయాలకు తిరుగులేకుండా ఉండేది. తమ్ముడి నిర్ణయాలను అన్న కూడా ఏనాడూ ప్రశ్నించలేదని పార్టీ నేతలే చెబుతారు. ఏ ఎన్నికైనా  అయ్యన్నపాత్రుడి గెలుపే లక్ష్యంగా నేతలను, కార్యకర్తలను సన్యాసిపాత్రుడు సమన్వయంతో పనిచేయించేవారు.

 

అలాంటిది 2014లొనే అయ్యన్న రాజకీయంలో కొడుకు విజయ్ జోక్యం మొదలైన తర్వాత సన్యాసిపాత్రుడి పాత్ర తగ్గిపోయింది. అన్న కొడుకుతో సన్యాసిపాత్రుడికి విభేదాలు మొదలయ్యాయి. సన్యాసి ఏమి చెప్పినా వినకుండా విజయ్ సొంత నిర్ణయాలు తీసుకోవటం మొదలుపెట్టటంతో విభేదాలు పెరిగిపోయాయి. వీళ్ళద్దరి మధ్య వివాదాలను పరిష్కరించేందుకు అయ్యన్న కూడా పెద్దగా దృష్టి పెట్టలేదని సమాచారం.

 

ఒకవైపు కొడుకు, మరోవైపు తమ్ముడు చెరోవైపు నిలబడటంతో అయ్యన్నకు ఏమి చేయాలో అర్ధం కాలేదు. ఎంతైనా కొడుకు కాబట్టి కుటుంబపరంగా విజయ్ వైపే మొగ్గు చూపారు అయ్యన్న. దాంతో తమ్ముడి దూరమయ్యారు. దాని ప్రభావం మొన్నటి అయ్యన్న ఓటమిలో స్పష్టంగా కనబడింది. పార్టీ కూడా ఘోరంగా ఓడిపోవటంతో సన్యాసి హఠాత్తుగా టిడిపికి రాజీనామా చేశారు. టిడిపికి రాజీనామా చేశారంటే ఏదో రోజు వైసిపిలో చేరటమే మిగిలుందని అర్ధమవుతోంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: