దాచేపల్లి అక్రమ తవ్వకాల వ్యవహారంలో టీడీపీ నేత యరపతినేనికి షాక్ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం కేసులతో కుట్ర చేస్తోందని ఆరోపణలకు చెక్ పెడుతూ ఈ వ్యవహారాన్ని సిబిఐకి అప్పగించింది. ఇదే విషయాన్ని ఏపీ సర్కార్ హైకోర్టుకు నివేదించింది. టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావుకు జగన్ సర్కారు షాకిచ్చింది. పల్నాడులో అక్రమ గనుల తవ్వకాన్ని సిబిఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గురజాల నియోజక వర్గంలో అక్రమ మైనింగ్ విషయంలో సీబీఐ విచారణకు అనుమతిస్తూ ఈ ఏడాది ఆగస్టు ఇరవై ఆరు న హై కోర్టు తీర్పు చెప్పింది. ఈ విషయమై సీబీఐ విచారణ అవసరమో కాదో ఆలోచించుకోవాలి అంటూ ఏపీ సర్కారుకు సమయం ఇచ్చింది.


దీంతో ఈ విషయంలో సీబీఐ విచారణకు ఒప్పుకుంటూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని ఏపీ సర్కార్ హైకోర్టుకు నివేదించింది. రెండు వేల పద్నాలుగులో టిడిపి అధికారంలోకి వచ్చాక పల్నాడు ప్రాంతం గురజాల నియోజక వర్గం పిడుగురాళ్ల మండలం కోనంకి, దాచేపల్లి మండలంలోని నడికుడి, కేసానుపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ క్వారీయింగ్ కు పాల్పడుతూ సుమారు కోటి మెట్రిక్ టన్నుల తెల్లరాయి దోచేశారని ఆరోపణలున్నాయి. ఎరపతినేని కనుసన్నల్లో సాగిన అక్రమ మైనింగ్ పై గత ఏడాది ఆగస్టులో సీబీసీఐడీ విచారణ చేపట్టింది. ఇప్పటి వరకు అక్రమ మైనింగ్ పై జరిపిన దర్యాప్తునకు సంబంధించి నివేదికను సీల్డ్ కవర్ లో గత సోమవారం అధికారులు హై కోర్టు ముందుంచారు. మనీ లాండరింగ్ కోణంలో కేసు దర్యాప్తు జరపాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.



అయితే యరపతినేనిపై రాజకీయ కుట్ర జరుగుతోందని ప్రతీకార రాజకీయాల్లో భాగంగా ఆయనను ఇబ్బందులు పెడుతున్నారని కొంతకాలంగా తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు అన్నిటినీ తిప్పి కొట్టేందుకే జగన్ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. రాజకీయ వేధింపుల ఆరోపణలు రాకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయితే ఈ ఆరోపణల నుండి బయటపడచ్చు అనేది ప్రభుత్వ యోచనగా తెలుస్తోంది. ఇక ఈకేసు ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీబీఐకి అప్పగించే మొదటి కేసుగా మారనుంది. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రంలోకి సీబీఐకి అనుమతి లేకుండా నిషేధం విధించారు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఉత్తర్వులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. రాజకీయ వేధింపులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలకు చెక్ చెప్పేందుకు సీబీఐకి అప్పజెప్పాలని నిర్ణయం తీసుకోగా దీనిని టిడిపి వర్గాలు తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశముంది.


మరింత సమాచారం తెలుసుకోండి: