కాంగ్రెస్ హయాంలో బెజవాడ పోలీస్ కంట్రోల్‌రూము వద్ద నిర్మించిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని టిడిపి సర్కారు తొలగించడం అప్పట్లో పెను వివాదానికి దారితీసింది. బాబు సర్కారు కక్షసాధింపుతోనే మహానేత విగ్రహాన్ని తొలగించిందని వైసీపీ నేతలు ఆందోళనలు నిర్వహించారు. అయితే రోడ్డుకు అడ్డుగా ఉన్నందుకే దానిని తొలగించామని టిడిపి నేతలు అప్పట్లో వాదించారు. ప్రభుత్వం మారిన తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కారు మళ్లీ వైఎస్ విగ్రహ ప్రతిష్ఠపై దృష్టి సారించింది. మంత్రి బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు అక్కడికి వెళ్లి విగ్రహ ఏర్పాట్లను పరిశీలించారు.

ఆ తర్వాత దివంగత నేత జయంతి రోజున మళ్లీ ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పట్లో వైఎస్ పేద ప్రజలకు మేలు చేసే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినందున, ఆయన గుర్తుగా అక్కడే వైఎస్ విగ్రహ ప్రతిష్ఠను ఎవరూ అడ్డుకోలేకపోయారు. నిజానికి గతంలో కంటే ఈసారి ఆకర్షణీయంగా వైఎస్ విగ్రహం ఏర్పాటుచేశారు. అందులో జీవకళ ఉట్టిపడుతోంది.

అయితే.. టిడిపి ప్రభుత్వ హయాంలో విజయవాడలో జరిగిన కృష్ణా పుష్కరాల సమయంలో 64 దేవాలయాలు, అందులో ఉన్న దేవతా విగ్రహాలను రోడ్ల అభివృద్ధి పేరిట తొలగించారు.అందులో చాలా విగ్రహాలను మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఒక మూలన పడేయడం వివాదానికి దారితీసింది.

టిడిపి ప్రభుత్వ నిర్ణయాన్ని హిందు సంస్థలు, స్వామీజీలు, పీఠాథిపతులు తప్పుపట్టారు. శివస్వామి పాదయాత్ర నిర్వహించగా, విశాఖ శారదా పీఠాథిపతి స్వరూపానంద సరస్వతి ఆ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వనికి తగిన శాస్తి జరుగుతుందని, హిందువుల మనోభావాలతో టిడిపి సర్కారు ఆడుకుంటోందని మండిపడ్డారు. దానికి నిరసనగా చాలామంది స్వాములు విజయవాడలో ధర్నా నిర్వహించారు.

అయితే.. పోలీసు కంట్రోలు రూము వద్ద వైఎస్ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన జగన్ ప్రభుత్వం, అదే రీతిలో కూల్చిన దేవాలయాలు, తొలగించిన దేవతా విగ్రహాలను ప్రతిష్ఠించకపోవడంపై హిందు సంస్థల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీన్నిబట్టి.. వైఎస్ విగ్రహంపై ఉన్న శ్రద్ధ, దేవతా విగ్రహ ప్రతిష్ఠపై లేదన్న విషయం స్పష్టవుతోందని విరుచుకుపడుతున్నారు. గతంలో దేవాలయాల పునర్మిర్మాణంపై హామీ ఇచ్చిన వెల్లంపల్లి శ్రీనివాస్ ఇప్పుడు ఆ శాఖకు మంత్రిగా ఉన్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు.

‘జగన్ ప్రభుత్వానికి తన తండ్రి విగ్రహాన్ని ప్రతిష్ఠించడంలో ఉన్న ఆసక్తి, హిందూ దేవాలయాల పునర్మిర్మాణాలపై లేదనడానికి ఇదే నిదర్శనం. గోశాలలో వంద ఆవులు చనిపోతే ఇంతవరకూ దానికి కారణాలు బయటపెట్టలేదు. విశాఖ‌లో చర్చిలను పరిరక్షించాల‌ని స్వయంగా సీపీనే ఆదేశాలిచ్చారు. జగన్ ప్రభుత్వం కేవలం ఒక మతానికే ప్రాధాన్యం ఇస్తుందనడానికి ఇంతకంటే ఆధారాలు ఇంకేం కావాలని బిజెపి ధార్మిక సెల్ అధ్యక్షుడు తూములూరు చైతన్య ప్రశ్నించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: