ఎన్నాళ్లో వేచిన ఉదయం వచ్చేసింది.. చందమామ చేతికి అందే శుభ సమయం వచ్చేసింది. మరికొన్ని గంటల్లో చంద్రునిపైకి మన చంద్రయాన్ పంపిన రోవర్ ప్రజ్ఞాన్ అడుగు పెట్టబోతోంది.. భారత అంతరిక్ష రంగ చరిత్రలో ఇది అత్యంత కీలకమైన రోజు. ఏళ్ల తరబడి వందల మంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు పడ్డ శ్రమకు ఫలితం దక్కే రోజు.


మన వ్యోమనౌక ‘చంద్రయాన్‌-2’ మరికొన్ని గంటల్లో కాలుపెట్టబోతోంది. అందులో నుంచి రోవర్‌ ప్రజ్ఞాన్ బయటకు వచ్చి చంద్రునిపై అటూఇటూ తిరగబోతోంది. ‘చంద్రయాన్‌-2’లోని ‘విక్రమ్‌’ ల్యాండర్‌ శుక్రవారం అర్ధరాత్రి దాటాక రాత్రి ఒకటిన్నర, రెండున్నర మధ్య చంద్రునిపై అడుగుపెట్టనుంది.


ఈ ప్రయోగం.. విజయవంతమైతే... జాబిల్లిపై వ్యోమనౌకను సురక్షితంగా దించిన నాలుగో దేశంగా భారత్‌ అవతరిస్తుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై వ్యోమనౌకను దించిన తొలి దేశంగా భారత్‌ ఘనత సాధిస్తుంది. ఈ ఏడాది జులై 22న మధ్యాహ్నం 2.43 గంటలకు ‘చంద్రయాన్‌-2’ నింగిలోకి దూసుకెళ్లింది. సుదీర్ఘ ప్రయాణంలో ఎక్కడా తడబడకుండా తన లక్ష్యం వైపు దూసుకెళ్లింది. ప్రతి విన్యాసాన్నీ అత్యంత కచ్చితత్వంతో పూర్తిచేసింది.


‘చంద్రయాన్‌-2’ జాబిల్లిపై దిగే అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు ప్రధాని సిద్ధమవుతున్నారు. ఆయన 70 మంది విద్యార్థులతో కలిసి ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. ల్యాండింగ్‌ ప్రక్రియను ఇస్రో ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. యూట్యూబ్‌లో ప్రెస్‌ ఇన్‌ఫర్మేషన్‌ బ్యూరో ఆఫ్‌ ఇండియా ఛానల్‌ ద్వారా లైవ్ ఇస్తుంది. భారత దేశం గర్వపడే ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు మీరు కూాడ సిద్ధమవుతున్నారు కదూ.. తప్పుకుండా చూడండి.. ఈ సాంకేతిక అద్భుతం గురించి మీరు కూడా ఇతరులకు చెప్పండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: