తిరుపతిలో భూ ఆక్రమణ వ్యవహారం కాక రేపుతోంది. ఏళ్ల తరబడి వివాదంలో ఉన్న హథీరాంజీ మఠం భూములపై రెవెన్యూశాఖ చర్యలు తీసుకోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తీర మఠం భూములైనా సరైన రీతిలో తొలగించారా అంటే అదీ లేదని విమర్శలొస్తున్నాయి. రాష్ట్రంలో అక్రమ కట్టడాలపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టింది. ఎక్కడ అక్రమ నిర్మాణాలు ఉన్నా చర్యలు తీసుకోవాలంటూ రెవెన్యూశాఖకు ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్.



అయితే అందుకు భిన్నంగా తిరుపతి అర్బన్, రూరల్ లో రెవెన్యూశాఖ భిన్నంగా వ్యవహరిస్తోందని ఆరోపణలొస్తున్నాయి. అందుకు ముఖ్య కారణం ఏళ్ల తరబడి వివాదంలో ఉన్న హథీరాంజీ మఠం భూములపై రెవిన్యూశాఖ తీసుకుంటున్న చర్యలే. తిరుపతిలో మఠం భూముల వ్యవహారం ఈనాటిది కాదు, ఏళ్ల తరబడి కొనసాగుతున్న సమస్య. కానీ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసిందనే ఒక్క కారణంతో హథీరాంజీ మఠంలోని నిర్మాణాలను రెవిన్యూశాఖ కూల్చివేయటం ప్రస్తుతం తిరుపతిలో హాట్ టాపిక్ గా మారింది. కృష్ణానది కరకట్టకు మించిన భూ ఆక్రమణలు చంద్రగిరి నుంచి ప్రవహించే స్వర్ణముఖి నది కేంద్రంగా జరిగాయి. చంద్రగిరి, తిరుపతి రూరల్, తిరుచానూరు, శ్రీ కాళహస్తి వరకు అక్రమ కట్టడాలున్నాయి.



పెద్దపెద్ద భూ రాబందులు అక్కడ తిష్ట వేసి ఉన్నారు. అక్కడి వాటిపై చర్యలు తీసుకోకుండా వివాదాల్లో ఉండే భూముల విషయంలో ఎందుకు రెవిన్యూ అధికారులు ఆసక్తి చూపుతున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు. అధికారులు మాత్రం అవిలాల పంచాయతీ పరిధిలోని భూములు హథీరాంజీ మఠానికి చెందుతాయని అంటున్నారు. దీనిపై ఇప్పటికే హై కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని అంటున్నారు. స్థానికులు మాత్రం పది సంవత్సరాలు అక్కడే నివాసం ఉంటున్నామని ఇప్పుడు తమది కాదంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. తిరుపతిలో చాలా వరకు హథీరాంజీ మఠం భూములు ఆక్రమణలకు గురయ్యాయి. వీటి పై గతంలో మఠం పెద్దలు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం తమ ఇళ్లను కూల్చి వేయడం దారుణమని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: