జమ్మూకశ్మీర్ వ్యవహారాన్ని బీజేపీ ప్రభుత్వం చాలా చాకచక్యంగా డీల్ చేస్తోంది. తాజాగా జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన ఇవ్వడం, ప్రత్యేక ప్రతిపత్తి తొలగించడం వంటి అతిపెద్ద నిర్ణయాలతో ఆ ప్రాంత భవిష్యత్తునే మార్చేసిన మోడీ, అక్కడ పాగా వేయడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. జమ్ముకాశ్మీర్ యువతను సన్మార్గంలో నడిపించేందుకు, చెడు ఆలోచనల నుండి దూరంగా ఉంచడానికి జమ్ముకాశ్మీర్ చరిత్రలోనే అతిపెద్ద నిర్ణయం ఒకటి తీసుకున్నారు.


యువతకు మెరుగైన జీవనోపాది కల్పించడం ద్వారా వారిని తీవ్రవాదం వైపు నుంచి దృష్టి మరల్చేందుకు ఉద్యోగాలు ఎరగా వేయాలని నిర్ణయించిన కేంద్రం, ఒకేసారి 50 వేల ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేస్తోంది. అలాగే వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేయడంతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కశ్మీర్‌లో పెట్టుబడులు పెట్టేవారికి ఏడేళ్లపాటు పన్ను మినహాయింపుతో పాటు జీఎస్టీని కూడా మినహాయించాలని కేంద్ర సర్కార్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. కశ్మీర్‌లో త్వరలో పెట్టుబడుల సదస్సు నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించనున్నట్టు విశ్వసనీయ సమాచారం.


జమ్మూకశ్మీర్‌లో ఇప్పటి వరకు అమల్లో ఉన్న ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్రం...కశ్మీర్, లడఖ్ పునర్నిర్మాణం కోసం ప్రణాళికలు రచిస్తోంది. కశ్మీర్‌లో పరిస్థితుల అధ్యయనానికి ప్రత్యేక బృందాన్ని కూడా పంపనున్నట్టు తెలుస్తోంది. అలాగే, కశ్మీర్, లడఖ్ యువతకు సరిహద్దు దళాల్లో 50 వేల ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది  అయితే ఒక ప్రాంతంలో ఇన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అవడం చాలా అరుదైన విషయంగా చర్చ జరుగుతోంది.


చెడు మార్గంలో పయనిస్తే ఎప్పటికైనా ప్రమాదమేనని, అదే ప్రభుత్వ ఉద్యోగంలో చేరితే జీవితానికి భద్రత ఉంటుందనే సంకేతాలను యువతకు బలంగా ఇచ్చేందుకు కేంద్రం పావులు కదుపుతోంది. అంతే కాకుండా కొంచెం జాగ్రత్తపడి చదివితే, ఒక్క మూడు నెలలు కష్ట పడితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో సెటిలైపోవచ్చు అన్న మంచి సందేశంతో, ఆవేశాలను చల్లార్చి ఆనందోత్సాహాలు వెల్లివిరిసేలా చేస్తోంది మోడీ సర్కార్. స్థానిక యువతలో ఈ నిర్ణయం ద్వారా కొత్త ఆశలు చిగురింపజేసి వారిలో అనూహ్య మార్పుతీసుకు వచ్చేందుకు మోదీ సర్కార్ వినూత్నంగా అడుగులు వేస్తోంది. ఈ నోటిఫికేషన్ గురించి గవర్నర్ సత్యపాల్ మాలిక్ మాట్లాడుతూ జమ్మూకశ్మీర్ చరిత్రలోనే ఇది అత్యంత భారీ నియామక ప్రక్రియ అని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: