మనిషి జీవితం ఎప్పటికి అర్ధం కాని ఓ పుస్తకం.అందులో జననం హెడ్ లైనైతే,మరణం ఎండింగ్ లైన్.ఈ హెడ్ లైన్‌కు ఎండింగ్ లైనుకు మధ్యలో ఉన్న ఎన్నో అక్షరాలే జీవిత పాఠాలు.ఆ పాఠాలలో నేర్చుకోవలసింది సాటి మనిషిని,మనిషిగా గుర్తించడం.అతను బ్రతికి ఉన్న నాళ్లైనా,మరణించాక ఐనా విలువ ఇవ్వడమనే సంస్కారాన్ని ప్రతివారు నేర్చుకోవాలి. ఎందుకంటే మనిషి జన్మకు ఇద్దరు అవసరం అయితే,అదే మనిషిని మోయడానికి నలుగురు కావాలి.ఇద్దరితో ఆరంభమైన జీవితం నలుగురితో ముగుస్తుంది. ఇంతగా ఎందుకు చర్చిస్తున్నానంటే,పాపం అనాధ మరణించాడు అనే జాలి లేకుండా ఓ కుక్కను ఈడ్చినట్టు,పనికి రాని చెత్తను పోగేసినట్టు,చనిపోయిన అనాధ శవాన్ని తీసుకెళ్లారు మున్సిపల్ సిబ్బంది.



బ్రతుకున్నప్పుడు ఎలాగో విలువివ్వని మనుషులు కనీసం మరణించిన మనిషి ఆత్మ శాంతికోసమైన విలువ ఇవ్వచ్చుకదా, సమాజంలో మానవత్వం రోజు రోజుకు మాయమవు తుందనడానికి ఈ సంఘటనే నిదర్శనం.కన్నీళ్లు పెట్టేలా వున్న ఈ సంఘటన జరిగింది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో,అక్కడి మున్సిపల్ సిబ్బంది నిర్వాకం, నివ్వెరబోయేలా చేసింది.అనాథ శవంపై చూపిన అశ్రద్ధ,కోపం,బాధ తెప్పిస్తోంది.చెత్తవేసే ట్రాలీలో అంతిమయాత్ర నిర్వహించడం కంటతడి పెట్టిస్తోంది.అనాథ శవాలకు మున్సిపల్ సిబ్బంది అంతిమ సంస్కారాలు జరిపించడం మామూలే అయినప్పటికీ,అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది.రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఉన్న మూడుగుడుల సెంటర్‌లో ఒక అనాథ యాచకుడు మృతి చెందాడు.అయితే సమాచారం అందుకున్న నగరపాలక సంస్థ పారిశుద్ధ్య సిబ్బంది అక్కడకి చేరుకున్నారు.మృతుని సంబంధీకులెవరూ లేరని నిర్ధారించుకున్నాక ఆ శవానికి అంతిమ సంస్కారాలు నిర్వహించాలని నిర్ణయించారు.



వారికి అందుబాటులో అంతిమయాత్ర వాహనాలు ఉన్నప్పటికీ చెత్తను తరలించడానికి ఉపయోగించే ఒక చిన్న తోపుడు బండిని తీసుకువచ్చి,అందులో శవాన్ని స్మశానికి తరలించే కార్యక్రమానికి పూనుకున్నారు మేధావులు.అయితే తోపుడు బండి చిన్నదిగా ఉండటంతో కాళ్లు బయటకు వేలాడుతున్నాయి,ముఖం కనిపించకుండా పైన గుడ్డ కప్పి,అక్కడి నుండి తోపుడు బండిని తోసుకుంటూ స్థానిక శ్మశానానికి  తరలించి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.మరణం అందరికి సమానమే,ఏదో ఒకరోజు ప్రతివారు అక్కడికి వెళ్లవలసిన వారే అని తెలిసి కూడా ఇంత దారుణంగా ప్రవర్తించడం అమానుషం.వారు పోయాక వాళ్ల వాళ్లు ఇలా చేస్తే ఆత్మ ఎంతగా ఘోషిస్తుందో సాటిమనిషిగా అర్ధం చేసుకోలేక పోయారంటున్నారు.ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో రాజమహేంద్రవరం మున్సిపల్‌ సిబ్బందిపై, నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: