ఆయన ఇస్రో ఛైర్మన్.. భారత దేశం ప్రతిష్టాత్మకంగా భావించే అంతరిక్ష పరిశోధన సంస్థ అధిపతి. దేశానికి ఎన్నో ప్రయోజనాలు చేకూర్చే ప్రయోగాలు చేసే ప్రతిష్టాత్మక సంస్థకు ఛైర్మన్. అయినా ఆయన చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు.. కన్నీరు పెట్టుకున్నాడు. చంద్రయాన్ 2 ప్రయోగం ఆద్యంతం విజయవంతంగా సాగి.. చిట్ట చివరి నిమిషంలో విఫలం కావడం ఆయన్ను అమితంగా బాధించింది.


దేశం యావత్తూ తమ వైపు ఆశగా చూస్తున్న వేళ.. ఆ ఆశలను నెరవేర్చలేకపోయానే అన్న బాధ ఓవైపు.. రేయింబగళ్లు కష్టపడి పని చేసినా చివరి నిమిషంలో పరాజయం పలకరించిందేనే అంతర్మథనం ఓవైపు.. ఆ శివన్ ను ఎంతగా బాధించి ఉంటాయో.. ఆయన ప్రధానమంత్రి వద్ద కన్నీరు పెట్టుకున్న తీరే చెబుతుంది.


ప్రధాన మంత్రి ఇస్రో నుంచి బయటకు వెళ్తున్న సమయంలో జరిగిన ఈ చిన్న సంఘటన యావత్ భారత్ దేశాన్ని ఆకట్టుకుంది. ప్రధానికి వీడ్కోలు చెప్పే సమయంలో శివన్ కంట కనిపించిన కన్నీరు ప్రధానిని సైతం కదిలించింది. ఆయన బాధను అర్థం చేసుకున్న ప్రధాని ఆ క్షణంలో తానో ప్రధానిని అన్న విషయం మరచిపోయారు. ఓ తమ్ముడిలా శివన్ ను భావించారు. గుండెలకు హత్తుకుని ఓదార్చారు. ఆ ఓదార్పు ఎంత భావోద్వేగంగా ఉందో వీడియో చూస్తే అర్థం అవుతుంది.


తన గుండెల్లో తల పెట్టి కన్నీరు పెట్టుకున్న శివన్ ను ఆప్యాయంగా హృదయానికి హత్తుకుని ఏం పర్వాలేదు.. ముందు ముందు ఇలాంటి ప్రయోగాలు ఎన్నో చేద్దామని భరోసా ఇచ్చేలా పదే పదే శివన్ భుజాన్ని తడుతూ అనునయించిన తీరు.. చూపరుల్లోనూ భావోద్వేగాలు రగిలించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం.. ఈ విషయంలో కనబరిచిన స్ఫూర్తి దేశ ప్రజల మనసులు గెలిచింది. శివన్ కు ప్రధాని ఇచ్చిన భరోసా.. మరెన్నో ఇస్రో విజయాలకు పునాది అవుతుందనడంలో సందేహం లేదు.. జై ఇస్రో.. జైజై భారత్.


మరింత సమాచారం తెలుసుకోండి: