వంద రోజుల పాలన పూర్తి చేసుకుంటున్న వేళ ఏపీ సీఎం జగన్ తన పాలనపై తాను స్వయంగా స్పందిస్తున్నాడు.. ఇప్పటి వరకూ పాలన ఎలా సాగింది.. ముందు ముందు ఎలా పాలన ఉండబోతోందో ప్రజలకు చెబుతున్నారు. తనకు తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డే రోల్ మోడల్ అని కుండబద్దలు కొట్టి చెబుతున్నారు. ఎన్నికల ముందు కూడా జగన్ ఇదే విషయాన్ని పక్కాగా వినిపించారు. రాజన్న రాజ్యం తెస్తానని ప్రజలకు మాట ఇచ్చారు.


ఇప్పుడు అదే మాట మరోసారి చెబుతున్నారు.. తాను తిరిగినంతగా ఏ రాజకీయ నాయకుడు కూడా వెళ్లి ఉండడని.. ఓదార్పుయాత్ర, పాదయాత్ర వంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా పేదల వద్దకు నేరుగా వెళ్లానని ఆయన గుర్తు చేసుకుంటున్నారు. పేదరికాన్ని దగ్గర నుంచి చూశాను. పేదరికం పోవాలంటే ఆ కుటుంబం నుంచి ఒక్కడైనా పెద్ద చదువులు చదవాలి. నా కళ్లతో జరిగేదంతా చూశాను. వ్యవస్థ పూర్తిగా మారాలి.. అని చెబుతున్నారు జగన్.


2011 లెక్కల ప్రకారం 33 శాతం మందికి ఏపీ రాష్ట్రంలో చదువు రావడం లేదు. దేశం కన్నా మనం అన్యాయంగా ఉన్నాం. చదివించాలన్న తపన ఉన్నా కూడా కడుపులో అన్నం పడితే దాని తరువాత వచ్చే ఆలోచన చదువు. ఈ పరిస్థితి మార్చాలన్న ఆలోచనతో ఈ 33 శాతాన్ని సున్నాకు తీసుకెళ్లాలి. ఆ తల్లికి అవగాహన కల్పించాలి. అందుకే అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టాం. పిల్లలను బడికి పంపిస్తే చాలు రూ.15 వేలు ఇస్తామని జగన్ చెబుతున్నారు.


18 ఏళ్ల నుంచి 23 ఏళ్ల వరకు ఉన్న విద్యార్థులు ఎంతమంది కాలేజీల్లో చేరుతున్నారని లెక్కలేస్తే.. బ్రిక్స్‌ దేశాలతో మనం పోల్చుకుంటే రష్యాలో 81, చైనాలో 56, మన దేశంలో 20 శాతమే ఉంది. రష్యాను బీట్‌ చేయాలంటే వంద శాతం ఫీజు రీయింబర్స్ మెంట్‌ తీసుకురావాలి. బోర్డింగ్‌, లాడ్జింగ్‌ కోసం ఏడాదికి రూ.20 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. నాకు స్ఫూర్తి...రోల్‌ మాడల్‌ దివంగత నేత వైయస్‌ రాజశేఖరరెడ్డి మాత్రమే అని గర్వంగా చెబుతున్నా. రాబోయే రోజుల్లో ఈ కాలేజీలో మార్పు కనిపిస్తుంది. కాలేజీలను బ్రహ్మండంగా తీర్చిదిద్దుతానని మాటిస్తున్నాను..అంటూ తన పాలన భవిష్యత్ చిత్రాన్ని కళ్లకు కట్టారు వైఎస్ జగన్.


మరింత సమాచారం తెలుసుకోండి: