దేశ హోంశాఖ మాజీ మంత్రి పి చిదంబరం జైలు జీవితం ఆధ్యాత్మిక పట్టణంతో మొదలైంది. తీహార్ జైల్ లోని తొమ్మిదో వార్డులో ఉన్న ఏడు నెంబర్ సెల్ లో ఆయనను బంధించారు. తెల్లవారుజామున ఐదు గంటలకే నిద్రలేచిన ఆయన కాసేపు జైలు ఆవరణలోనే మార్నింగ్ వాక్ చేశారు. అనంతరం ఆధ్యాత్మిక గ్రంథాలు పట్టించారు. వాటిలో ఎక్కువ భాగం తమిళం, ఇంగ్లీషులో ఉన్నవి. అనంతరం పాలు, బ్రెడ్ తీసుకున్నారు. ఓట్స్ తో చేసిన సంకటి ఆయనకు బ్రేక్ ఫాస్ట్ గా ఇచ్చారు. ఆ తరవాత కాసేపు లైబ్రరీల్లో దినపత్రికలు చదివారు.


సాధారణ జీవితంలో కష్టం తెలియకుండా పెరిగిన ఈ డెబ్బై నాలుగేళ్ల ఆర్థికవేత్త రాత్రంతా చెరసాలలో చెక్కతో చేసిన బల్ల మంచంపై నిద్రించారు. దానిపై తాను పడుకోలేనని ఓ మంచం ఏర్పాటు చేయాలని ఆయన జైలు అధికారులను కోరారు, కానీ వారు అంగీకరించలేదు. వైద్యులు పరీక్ష చేసి ఇమ్మంటేనే ఇస్తామని స్పష్టం చేయడంతో ఆయన మరేమీ చేయలేకపోయారు. ఆయన సరిగ్గా నిద్ర పోలేదనీ అశాంతిగా విసుగ్గా కాస్తంత ఆందోళనగా గడిపారని జైలు వర్గాలు తెలిపాయి. వెస్ట్రన్ టాయిలెట్ ఉన్న గదిని ప్రత్యేకంగా కేటాయించడం మినహా ఆయనకు మరే ఇతర సౌకర్యాలూ కలగ చేయలేదని అధికారులు స్పష్టం చేశారు. ఆయన ఉన్న ఏడో నెంబర్ సెల్ లోని గతంలో చిదంబరం కుమారుడు ప్రస్తుత ఎంపీ కార్తీ చిదంబరం కూడా పన్నెండు రోజుల పాటు ఉన్నారు.



వీరిద్దరిదీ ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసు కావడం విశేషం. ఉదయం పది గంటల వేళ కార్తీ జైలుకొచ్చి ఆయనతో కాసేపు మాట్లాడారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో చిదంబరం వ్యక్తిగత న్యాయవాది దయాని క్రిస్టల్ వచ్చి బెయిలు దాఖలు చేసే విషయాన్ని చర్చించారు. బెయిల్ దొరక్కపోతే చిదంబరం ఈ నెల పంతొమ్మిది దాకా తీహార్ లోనే ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఈ నెల పదహారున పుట్టిన రోజును కూడా ఆయన జైల్లోనే ఉంటారు. కాగా ఎయిర్ సెల్ మ్యాక్సిస్ కేసు విచారణను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ఢిల్లీ లోని ప్రత్యేక కోర్టు పేర్కొంది.





మరింత సమాచారం తెలుసుకోండి: