వంద రోజుల జగన్ పాలనపై అక్కసుతో విషం చిమ్మిన చంద్రబాబు ఎన్నెన్ని మాటలు అన్నారో అంతా చూశారు. జగన్ కి ఫండమెంటల్ రూల్స్ తెలియవు, సబ్జెక్ట్ లేదు, ఆయన పాలన చేతకాదు, ఆయన పార్టీ గాలి పార్టీ, వైసీపీలో ఉన్నవారంతా రాక్షస సంతతి, ఏపీని మొత్తం ఫ్రాక్షన్ రాజ్యం చేస్తున్నారు.  ఇలా ఎన్నెన్ని మాటలు అన్నారో మరి. జగన్ ఈ జన్మలో సీఎం కాడు అని బాబు నిన్నటి దాకా రోజుకు పదిసార్లు గర్జించేవారు. ఇపుడు అదే జగన్ వందరోజుల  ముఖ్యమంత్రిగా పండుగ చేసుకుంటూంటే తెగ అక్కసు వెళ్ళగక్కుతున్నారు. బాధ సహజమే కదా మరి.


అయితే చంద్రబాబు చేసిన  విమర్శలపైన ఈ రోజు మంత్రి బొత్స సత్యనారాయణ ఓ రేంజిలో విరుచుకుపడ్డారు.  జగన్ మూడు నెలల పాలనలో మంచి ఏదీ కనిపించలేదా చంద్రబాబూ అంటూ నిప్పులు చెరిగారు. కిడ్నీ బాధితుల కోసం శ్రీకాకుళంలో జగన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ప్రారంభొత్సవం చేస్తే తండ్రీ కొడుకుల కళ్ళకు కనిపించలెదా అని ప్రశ్నించారు. ఏపీలో నాలుగు లక్షల ఉద్యోగాలు జగన్ ఇస్తూంటే ఒక్క ఉద్యోగమూ తన పాలనలో  ఇవ్వని చంద్రబాబు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. 


అమరావతి అంటూ  తెగ ఆరాటపడుతున్న చంద్రబాబు రాజధాని అమరావతి అని చట్టం ఏమైనా  చేశారా, గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారా అని బొత్స ప్రశ్నించారు.  అన్నీ తాత్కాలిక నిర్మాణాలు చేపట్టిన అమరావతిలో రాజధాని కూడా తాత్కాలికమేనన్న సంగతి బాబుకు తెలియదా అని  హాట్ కామెంట్స్ చేశారు.  


ఇక పవన్ కళ్యాణ్ లా తనకు నటన రాదని గట్టి కౌంటర్లే బొత్స వేశారు. పవన్ అప్పట్లో రాజధానికి కేవలం అయిదు వేల ఎకరాలు మాత్రమే సరిపోతాయని చెప్పారని, ఇపుడు అక్కడే రాజధాని కావాలని మాట మారుస్తున్నారని బొత్స చురకలు అంటించారు. పవన్ మాటలు, చేతలపైన బొత్స సెటైర్లు వేశారు. మొత్తం మీద బొత్స దుమ్ము దులుపుడుకి చంద్రబాబు  బాగా ఇబ్బంది పడ్డారన్నది వాస్తవం.




మరింత సమాచారం తెలుసుకోండి: