శివన్. ఇప్పటి వరకు ఎవరికీ పెద్దగా పరిచయం లేని ఈ పేరు ఇప్పుడు చిన్న పిల్లాడు  కూడా గుర్తుపట్టేస్తాడు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఛైర్మన్ అయిన శివన్ చంద్రయాన్ 2   ల్యాండర్ సంకేతాలు ఆగిపోవడంతో  చిన్న పిల్లాడిలా ఏడ్చిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచినా ఆ కన్నీళ్ళ వెనక ఎన్ని కలలు, కష్టాలు దాగున్నాయో కొద్దిమందికే తెలుసు. తమిళనాడులో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన శివన్ చదువంతా స్కాలర్ షిప్పుల మీదే సాగింది.


స్కూలుకెళ్ళడానికి కనీసం సరైన బట్టలు లేకుండా ధోతి కట్టుకుని వెళ్ళేవాడు. ఆ విధంగా ఇంటర్ వరకు పూర్తి చేశాక ఇంజనీరింగు చదవాలని అనుకున్నాడు. కానీ ఆర్థిక స్తోమత సహకరించక బిఎస్సీ మ్యాథమెటిక్స్ లో జాయిన్ అయిపోయాడు. డిగ్రీ చేసిన తర్వాత తండ్రి సహకారంతో ఏరోనాటికల్ ఇంజనీరింగులో చేరాడు. ఆ తర్వాత ఐఐటీ బొంబాయిలో ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ చేశారు. దాని తర్వాత విక్రమ్ సారాభాయి సెంటర్ లో జాయిన్ అయ్యాడు.


క్రయోజనిక్ ఇంజన్ల తయారీలో శివన్ ది కీలక పాత్ర. పోఖ్రాన్‌ –1 అణుపరీక్షల తర్వాత సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపులో అమెరికా భారత్‌పై ఆంక్షలు విధించింది. దీంతో శీతల ఇంధనాల్ని వాడే క్రయోజెనిక్‌ ఇంజిన్లను స్వయంగా అభివృద్ధి చేసుకోవడం భారత్‌కు అనివార్యమైంది. క్రయోజనిక్ ఇంజన్లను తయారు చేసే బృందాన్ని ముందుండి నడిపించిన ఘనత శివన్ దే. ఇస్రోకి శివన్ చేసిన సేవలు ఎన్నో. ముఖ్యంగా ఆయన డిజైన్ చేసిన "సితార" సాఫ్ట్ వేర్ సహకారంతోనే ఇస్రో రాకెట్లను కక్ష్యలోకి పంపుతోంది.


మంగళ్ యాన్ వంటి ప్రాజెక్టులకు శివన్ వెన్నుదన్నులా నిలిచాడు. ఇన్ని బాధ్యతలు నిర్వహించిన శివన్ చంద్రయాన్ 2 ల్యాండర్ నుండి వచ్చే సంకేతాలు ఆగిపోవడంతో తాము కలలు, పడ్డ కష్టం ఇలా అయిపోయిందే అని ఏడ్చాడు. కానీ దేశం మొత్తం శివన్ వైపే నిలబడి ఉంది. చందమామ పైకి వెళ్ళడానికి చేసిన ప్రయత్నాల్లో మొదటిసారే ఎవరూ సక్సెస్ కాలేదు.అగ్ర రాజ్యాలైన అమెరికా, రష్యాలకి కూడా భంగపాటు తప్పలేదు. రైతు బిడ్డ నుండి రాకెట్ మ్యాన్ వరకు ఆయన ప్రయాణం చాలా గొప్పది.



మరింత సమాచారం తెలుసుకోండి: