ఇప్పుడిక మాటల్లేవు, మాట్లాడుకోవడాల్లేవు. దేనికైనా రెడీ అన్నట్టుగా ఉంది భారత్ పాక్ సరిహద్దుల్లో పరిస్థితి. అణ్వస్త్ర దేశంగా మా హక్కుల్ని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసంటూ ... లోలోపల భయపడుతూనే పైకి భయపెట్టే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్ ప్రభుత్వం. తాజాగా.. సరిహద్దులో కాల్పులకు తెగబడ్డ పాక్‌.. పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. దీంతో.. పాక్ పెద్ద కుట్రే చేస్తుందన్న భారత నిఘా వర్గాల అనుమానాలకు బలం పుంజుకున్నట్లవుతోంది. 


భారత్‌, పాక్‌ సరిహద్దులో మళ్ళీ తుపాకులు గర్జిస్తున్నాయి. పాక్‌వైపు నుంచి యధేచ్ఛగా కాల్పులు జరుగుతున్నాయి. మోర్టార్‌ షెల్స్‌ వచ్చి పడుతూ సరిహద్దు వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. సరిహద్దు పోస్టులపై కాల్పులకు తెగబడుతూ కవ్విస్తున్న పాక్‌ జవాన్లు.. మళ్ళీ కాల్పులకు తెగబడ్డారు. నౌషెరా సెక్టార్‌లో పౌరులే టార్గెట్‌గా కాల్పులకు తెగబడింది  పాక్ సైన్యం. కాల్పుల్లో పలు ఇళ్లు ధ్వంసం కాగా, వెంటనే రంగంలోకి దిగిన భారత సైన్యం సమర్థవంతంగా దాడులను తిప్పికొట్టింది.


ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నుతోంది పాకిస్తాన్‌. ఇందుకోసం సరిహద్దులో 230 మంది ఉగ్రవాదులను పాక్‌ సిద్ధం చేసింది. వీరిలో కొందరు ఇప్పటికే కశ్మీర్‌లోకి ప్రవేశించి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తోంది భారత్. కశ్మీర్‌లో పరిస్థితులు సాధారణ స్థితికి రావడం, లోయ నుంచి రోజుకు 750 ట్రక్కుల ఆపిల్స్‌ ఎగుమతి కావడంపై పాక్‌ లోని ఉగ్రమూకలు రగిలిపోతున్నాయంటున్నాయి నిఘా వర్గాలు. 


కశ్మీర్‌ వద్ద సరిహద్దులో 20 కి.మీ విస్తీర్ణంలో పాక్‌ ప్రత్యేకంగా కమ్యూనికేషన్‌ టవర్లను ఏర్పాటు చేసిందని తెలిపారు ఎన్‌ఎస్‌ఏ అజిత్‌ దోవల్‌. ఈ టవర్ల సాయంతో కశ్మీర్‌లోని ఉగ్రవాదులతో పాక్‌లోని వారి హ్యాండ్లర్లు సంప్రదింపులు జరుపుతున్నట్లు.. గుర్తించిన మన నిపుణులు వారి మాటలను డీకోడ్ చేశారు. ఓ పాకిస్తానీ హ్యాండ్లర్‌ మండిపడుతూ..'అసలు అన్ని ఆపిల్‌ ట్రక్కులు రాకపోకలు ఎలా సాగిస్తున్నాయ్‌? వాటిని మీరు ఆపలేరా? చేతకాకుంటే ఒప్పుకోండి. మీకు తుపాకులకు బదులుగా గాజులు పంపుతాం' అని రెచ్చగొట్టేలా పంజాబీలో పాక్‌ యాసలో మాట్లాడినట్టు గుర్తించారు అధికారులు. ఇది జరిగిన తర్వాత ఇద్దరు ఉగ్రవాదులు గత శుక్రవారం సోపోర్‌లోని దంగపురా ప్రాంతంలో ప్రముఖ ఆపిల్‌ వ్యాపారి హమీదుల్లా రాథర్‌ ఇంటికెళ్లారు. హమీదుల్లా ఆ సమయంలో నమాజ్‌కు వెళ్లడంతో ఆగ్రహంతో ఆయన కుటుంబసభ్యులపై పిస్టళ్లతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో హమీదుల్లా కుమారుడు ఇర్షాద్‌, రెండున్నరేళ్ల మనవరాలు అస్మాలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో చిన్నారి అస్మా ఆరోగ్యం విషమంగా ఉండటంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించినట్టు తెలిపారు అజీత్ దోవల్. మొత్తం మీద తిండి తినకుండా.. అయినా తుపాకులు తయారు చేసుకోండని చెప్పే పాక్... సరిహద్దులో భారీ కుట్రలకు పాల్పడుతోందని నిఘా వర్గాల సమాచారంతో.. అప్రమత్తమయ్యాయి భద్రతా బలగాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: