తెలంగాణ మంత్రి వర్గ ప్రక్షాళన ప్రక్రియ వాయిదా పడింది. రాష్ట్ర రాజకీయాలు టీఆర్ ఎస్ లో అంతర్గత పరిణామాల కారణంగానే సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆదివారం క్యాబినెట్ లో ఆరు ఖాళీల భర్తీతో పాటు ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులపై వేటు వేసి వారి స్థానంలో ఇతరులకు ఛాన్స్ ఇవ్వాలని ఆయన భావించారు. కానీ చివరి నిమిషంలో కేబినెట్ ప్రక్షాళన ప్రయత్నాన్ని తాత్కాలికంగా విరమించుకున్నట్లు తెలుస్తుంది. ఇటీవలి కాలంలో టీఆర్ ఎస్ ప్రభుత్వం పై బీజేపీ రాజకీయ దాడిని పెంచింది. మరోవైపు ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పోరు బాట పట్టింది. దీనికి తోడు ఈ మధ్య కాలంలో టీఆర్ ఎస్ లోనూ అసంతృప్తి భావనలు చాప కింద నీరులా వ్యాపిస్తున్నాయి. త్వరలో మున్సిపల్ ఎన్నికలు హుజూర్ నగర అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక రాబోతున్నాయి.


వీటన్నింటి నేపథ్యంలో ఇప్పుడు కేబినెట్ ప్రక్షాళన చేస్తే కొత్త సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుందనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఈ ప్రక్రియను ప్రస్తుతానికి పక్కకు పెట్టినట్లు తెలుస్తుంది. మున్సిసిపల్ ఎన్నికలు హుజూర్ నగర్ ఉపఎన్నిక తర్వాత క్యాబినేట్ ప్రక్షాళనకు అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక హరీశ్ రావుకు ఆర్థిక మంత్రి పదవి ఎందుకిచ్చారని చర్చ టీఆర్ ఎస్ వర్గాల్లోనే వినిపిస్తోంది. తప్పని సరి పరిస్థితుల్లో మంత్రి పదవి ఇచ్చారా లేక పరిస్థితులను చక్కదిద్దే బాధ్యత ఆయన చేతులో పెట్టారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శాసన సభ ఎన్నికల ముందు వరకు హరీశ్ రావు టీఆర్ ఎస్ లో కీలక నేత, తొలి ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ఆయనకు కీలకమైన నీటి పారుదల శాఖను కట్టబెట్టారు.


పార్టీకి సంబంధించి ఏ అవసరం వచ్చినా కేసీఆర్ నోట తొలుత హరీష్ పేరు వచ్చేది. అందుకు తగ్గట్టే హరీష్ మామకు తలలో నాలుకలా వ్యవహరించేవారు. ట్రబుల్ షూటర్ గా అవతరించారు. కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరాన్ని పరుగులెత్తించిన హరీష్ ఎన్నికల సమయానికి తుది దశకు తీసుకువచ్చారు. కాలంతో పోటీ పడి పనులు చేయించి కాళేశ్వరరావుగా పేరు తెచ్చుకున్నారు. గత ఏడాది డిసెంబరులో అసెంబ్లీ ముందస్తు ఎన్నికల నుంచి హఠాత్తుగా వాతావరణం మారిపోయింది. హరీష్ కు ప్రాధాన్యం తగ్గింది. ఎన్నికల్లో భారీ విజయం తర్వాత కేటీఆర్ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కాగా హరీష్ కు అసలు మంత్రివర్గంలోనే చోటు దక్కలేదు. తొమ్మిది నెలలుగా హరీశ్ రావు సొంత నియోజకవర్గం సిద్దిపేటకే పరిమితం అయ్యారు.


జనంలో వుంటూ వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తరువాత అసెంబ్లీలో కాంగ్రెస్, టిడిపిలను దిగ్విజయంగా ఖాళీ చేయించిన కేసీఆర్, కేటీఆర్ దూకుడుకు లోక్ సభ ఎన్నికల తర్వాత కళ్లెం పడింది. టీఆర్ ఎస్ కంచుకోటలైన నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు రాజధాని నగరంలో బీజేపీ దూకుడు పెరిగింది. ఈ నేపథ్యంలోనే తాజా మంత్రి వర్గ విస్తరణలో ఊగిసలాట మధ్య హరీష్ కు బెర్తు ఖరారైనట్లు తెలుస్తుంది. అప్పటి వరకూ నెలకొన్న వాతావరణం చూసి చాలా మంది టీఆర్ ఎస్ ముఖ్యులు హరీష్ ను మంత్రి వర్గంలోకి తీసుకోక పోవచ్చని అంతర్గత సంభాషణల్లో అభిప్రాయపడ్డారు. కానీ అనూహ్యంగా ఆయనను క్యాబినెట్ లోకి తీసుకున్నారు.



బీజేపీ కేంద్రంగా మారుతున్న రాజకీయ సమీకరణాలతోపాటు టీఆర్ ఎస్ లో అంతర్గతంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలోనే హరీష్ కు క్యాబినెట్ బెర్తు దక్కినట్లు తెలుస్తుంది. కేసీఆర్ ఇంట్లో ఆహ్వానం పలకడంలోను మంత్రిగా ప్రమాణ స్వీకార వేదిక మీద హరీష్ కు ప్రాధాన్యమిచ్చిన తీరు ఆయనకు కీలకమైన ఆర్థిక శాఖ అప్పగించటం ఇవన్నీ చర్చనియాంశమయ్యాయి. భారీ ప్రాజెక్టులను నెత్తికెత్తుకున్న తరుణంలో ఆర్థిక మాన్యం ముంచుకొచ్చి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మాట నిజం.



తెలంగాణ ధనిక రాష్ట్రమని చెబుతున్నప్పటికీ అనేక బిల్లుల చెల్లింపులో విపరీత జాప్యం తప్పటం లేదు. సీఎం కేసీఆర్ కు సమాచారం లేకుండా ఆర్థికశాఖ నుంచి ఏ బిల్లును చెల్లించకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ పరిణామాల మధ్య హరీష్ కు ఆర్థికశాఖను కేటాయించటం గమనార్హం. ఆర్థికశాఖ అప్పగించటం ట్రబుల్ షూటర్ గా ఆయన సేవలను ఉపయోగించుకోవడానికి మంత్రిగా చోటివ్వక తప్పని పరిస్థితుల్లో ప్రజలతో నేరుగా సంబంధాలు ఉండని శాఖ ఇచ్చి సరిపుచ్చుతున్నారా అనే చర్చ జరుగుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: