ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి పల్నాడును రక్షించుకోవడానికి ఈ నెల పదకొండు న ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని టిడిపి అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఒంటరి కాదని ఈ పర్యటన ద్వారా చాటుతామన్నారు. టిడిపి అంటే ఒక వ్యక్తి కాదు ఒక పెద్ద వ్యవస్థ అని ఈ కార్యక్రమం ద్వారా చెబుదామని దీనికి నాయకులంతా తరలి రావాలని పిలుపు నిచ్చారు. పోలీసులు పెట్టే ప్రతి అక్రమ కేసుకు సమాధానం చెప్పేలా దీన్ని నిర్వహిద్దామన్నారు.


పార్టీ నేతలతో ఆదివారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తలపై దాడుల గురించి మానవ హక్కుల సంఘానికి తెలపడంతో పాటు ప్రైవేటు కేసులు నమోదు చేద్దామన్నారు. పది న నిర్వహించనున్న న్యాయవాదుల సమావేశానికి టిడిపి లీగల్ సెల్ కు సంబంధించిన న్యాయవాదులంతా హాజరవుతారని చెప్పారు. ఈ విభాగాన్ని మరింత పటిష్ఠం చేద్దామని కార్యకర్తలపై దాడులను అక్రమ కేసులను ఎదుర్కొనేందుకు ఈ సెల్ అండగా ఉంటుందన్నారు. కార్యకర్తలంతా ధైర్యంగా పనిచెయ్యాలన్నారు. గుంటూరులోని బండ్లమూడి గార్డెన్స్ వేదిక రాష్ట్ర స్థాయి టిడిపి న్యాయవాద విభాగ ఆత్మీయ సమావేశం పది న నిర్వహిస్తారు.


వీళ్ల ఆటలు సాగనిచ్చేది లేదు ఇష్టానుసారం కొడతామంటే పడేందుకు సిద్ధంగా లేము ఎన్ని కేసులు పెడతారో పెట్టమనండి నేనూ చూస్తా అందరి ముందు నేనే వుంటే ముందు నా మీద కేసు పెట్టమనండి చూద్దామని చంద్రబాబు సవాల్ చేశారు. బాబాయిని ఎవరు చంపారో చెప్పలేని వ్యక్తి మనల్ని భయపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని పరోక్షంగా సీఎం జగన్ ను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. బాధితులను బస్సులు పెట్టి ర్యాలీగా తీసుకెళ్తాం. పదవ తేదీ రాత్రికి బాధితులంతా పునరావాస కేంద్రానికి వస్తే అక్కడి నుంచి వారి స్వస్థలాలకు వెళ్లేలా చేద్దాం. బెదిరించి భయపెట్టి రాజకీయం చేయటం వీళ్ల వల్ల కాదు అని చంద్రబాబు స్పష్టం చేశారు.






మరింత సమాచారం తెలుసుకోండి: