రెండోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టి వంద రోజులు పూర్తయ్యింది. ఈ వంద రోజుల్లో ఎన్నో మార్పులొచ్చాయి అన్నారు మోడీ. అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నామని బిజెపి నేతలు అంటుంటే అభివృద్ధి శూన్యమని విపక్షాలు విమర్శించాయి. అభివృద్ధి పెనుమార్పులతో తన రెండవ ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుందన్నారు ప్రధాన మంత్రి నరేంద్రమోడి. ప్రజల విశ్వాసం మద్దతు తోనే అది సాధ్యమైందన్నారు. ఈ వంద రోజుల్లో తీసుకున్న నిర్ణయాలకు నూట ముప్పై కోట్ల మంది భారతీయులే స్పూర్తి అన్నారు. హర్యానాలోని రోహ్ తక్ లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు మోడీ. ప్రజల విశ్వాసంతోనే వ్యవసాయ రంగం నుంచి జాతీయ భద్రత వరకు కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు.


తమకు సహకరించిన పార్టీలకు థ్యాంక్స్ చెప్పారు మోడీ. వంద రోజుల పాలనపై జన్ కనెక్ట్ పేరుతో బుక్ విడుదల చేశారు సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్. ట్రిపుల్ తలాక్ నిషేధం, పోక్సో చట్టంలో సవరణలు, ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనం, వచ్చే రెండేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో కోటి తొంభై ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం, ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఎ రద్దు లాంటి సాహసోపేత నిర్ణయాలను మోడీ ప్రభుత్వం తీసుకుందని జవదేకర్ చెప్పారు. ఈ వంద రోజుల్లోనే చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.


సమాజంలోని ప్రతి వర్గానికి మోడీ ప్రభుత్వం నమ్మకం కల్పించిదన్నారు. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, యూఏపీఏ చట్టంలో సవరణలు మోడీ నాయకత్వానికి ప్రతీకలని ట్వీట్ చేశారు అమిత్ షా. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి విరామం లేకుండా పని చేస్తున్నామన్నారు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. అభివృద్ధి రహిత వంద రోజుల పాలనకు శుభాకాంక్షలంటూ మోడీకి వెటకారంగా కంగ్రాట్స్ చెప్పారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ప్రజాస్వామ్యాన్ని కూలదోయటం నాయకత్వ లేమి ఆర్థిక వ్యవస్థ విధ్వంసం లాంటివన్నీ మోడీ నాయకత్వంలో జరిగాయన్నారు.


ఆర్థిక వ్యవస్థను మోడీ ధ్వంసం చేశారని ఆరోపించారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంది. మోడీ వంద రోజుల పాలనపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత కపిల్ సిబల్. కుట్రపూరిత, అహంకారపూరిత రాజకీయాలు అస్థిరత, ఆవేదన, రహస్య రాజకీయాలు చేస్తోందన్నారు. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఎ రద్దు జమ్మూ కశ్మీర్ విభజన లాంటి సంచలన నిర్ణయాలు ట్రిపుల్ తలాక్ రద్దు లాంటి చర్యలతో మోడి వంద రోజుల పాలన పూర్తయింది. అయితే ఆర్థిక మాంద్యం జిడిపి తిరోగమనం లాంటివి ప్రభుత్వానికి సవాల్ గా నిలుస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: