వాతావరణ మార్పులతో పాలమూరు జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. జ్వరపీడితులతో హాస్పిటళ్లు కిటకిటలాడుతున్నాయి. చంటి పిల్లల నుంచి పెద్దల దాకా అంతా మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ బాధితులే. గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య లోపం దోమల స్వైర విహారంతో జనానికి కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఏ వీధిలో చూసినా జ్వర పీడితులే కనిపిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటి వరకు మూడు వందల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.



ఈ వారంలోనే డెంగ్యూ ప్రభావం మరింత ఎక్కువైంది. జిల్లాల వారీగా నమోదైన డెంగ్యూ కేసులను పరిశీలిస్తే మహబూబ్ నగర్ జిల్లాలో నూట అరవై ఎనిమిది కేసులు, నారాయణ పేట జిల్లాలో నలభై, నాగర్ కర్నూల్ లో ముప్పై నాలుగు, వనపర్తిలో ముప్పై, జోగులాంబ గద్వాల జిల్లాలో రెండు చొప్పున నమోదయ్యాయి. రోజు రోజుకి ఈ సంఖ్య పెరగడంపై జనాల్లో ఆందోళన కలుగుతోంది. జిల్లా కేంద్రంలో ఇద్దరు చిన్నారులు డెంగ్యూతో చనిపోయారు.



జడ్చర్లలోని అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలో పంతొమ్మిది డెంగ్యూ కేసులు నమోదయ్యాయని చెబుతున్నారు అధికారులు. సీజనల్ వ్యాధులతో జిల్లాలోని ప్రైవేటు హాస్పిటళ్లు, ల్యాబుల్లో కాసుల వర్షం కురుస్తోంది.విషజ్వరాలు, చికున్ గున్యా, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ పరీక్షల పేరుతో వేలకు వేలు వసూలు చేస్తున్నారు. రోగులను ఆస్పత్రులు నిలువు దోపిడీ చేస్తున్నాయి. రోగానికి ఒక రేటు చొప్పున వేల నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నాయి.



మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖలు చేతులెత్తేయడంతో ఎక్కడ పారిశుధ్య నిర్మూలన కార్యక్రమాలు నిర్వహించటం లేదు. వైద్య ఆరోగ్య శాఖ చర్యలు కూడా నామ మాత్రంగా ఉన్నాయన్న ఆరోపణలున్నాయి. జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి వైద్య సేవలను మరింత విస్తరించాలని కోరుతున్నారు జనం. అవసరమైతే వైద్య సామగ్రిని అందుబాటులో ఉంచటంతో పాటు గ్రామ స్థాయి నుంచి పట్టణాల వరకు పారిశుధ్య నిర్మూలనకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: