టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున పల్నాడుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది, టిడిపి డిమాండ్ చేస్తున్నట్లుగా శిబిరంలో ఉన్న వారిని స్వగ్రామాలకు పోలీసులు తీసుకువెళ్ళి, భయం లేకుండా జీవించేలా భద్రత కల్పిస్తారని ప్రభుత్వం ప్రకటించింది. చలో ఆత్మకూరుకు పర్మిషన్ లేదని బిజెపి చెబుతున్నారు. అయితే చలో పల్నాడు కార్యక్రమంతో తమ కార్యకర్తలపై జరిగిన దాడులు అన్నింటినీ ప్రజల ముందు పెట్టాలనే పట్టుదలతో టిడిపి ఉంది. పల్నాడులో అత్యంత దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయని, తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని తెలుగు దేశం పార్టీ కొద్ది రోజులుగా తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. దాడులకు గురై గ్రామాల్లో ఉండలేక వచ్చేసిన వారి కోసం తెలుగు దేశం పార్టీ గుంటూరులో ఓ శిబిరం ఏర్పాటు చేసింది.



ఆ శిబిరంలో ఉన్న వారిని పోలీసులు పరామర్శించి, వారి గ్రామాలకి తీసుకెళ్లి వారి రోజువారీ జీవితాన్ని శాంతియుతంగా గడిపేలా భరోసా ఇవ్వాలని శిబిరం ఏర్పాటు చేసిన రోజున చంద్రబాబు డిమాండ్ చేశారు. లేకపోతే తానే వారిని గ్రామాలకు తీసుకెళ్లి విడిచిపెడతామని ప్రకటించారు. అయితే వైసీపీ దాడులకు గురైన వారి గురించి పోలీసులు, ప్రభుత్వం లైట్ తీసుకుంది. పోటీగా టిడిపి హయాంలో దాడులకు గురయ్యారంటూ పిడుగురాళ్లలో వైసీపీ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి హోంమంత్రి సుచరిత వెళ్లడం వివాదాస్పదమైంది. అధికారంలో వైసీపీ ప్రభుత్వం ఉంటే టిడిపి నేతల దాడులకు గురయ్యామని అధికార పార్టీనే శిబిరం ఏర్పాటు చేయడం ఏమిటన్న విమర్శలు వచ్చాయి. అయితే వాళ్లందరూ టిడిపి హయాంలో వేధింపులకు గురయ్యారని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు.



టీడీపీ శిబిరంలో వున్న వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులేనని ఆరోపణలు చేశారు. ప్రభుత్వం స్పందించే అవకాశం కనిపించకపోవడంతో టిడిపి అధినేత చలో ఆత్మకూరుకు పిలుపు నిచ్చారు. బాధితుల్ని తీసుకొని గ్రామాలకు వెళ్లి, వారిని ఆయా గ్రామాల్లో వదిలిపెట్టి భరోసా ఇచ్చి రావాలని నిర్ణయించుకున్నారు. టిడిపి కార్యకర్తలకు అండగా ఉండే విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకూడదనుకుంటున్న చంద్రబాబు చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పట్టుదలతో ఉన్నారు. పార్టీ నేతలందరికీ దిశానిర్ధేశం చేస్తున్నారు, ఇంతటి అరాచక పాలన ఎక్కడా చూడలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఊళ్ల నుంచి తరిమేసి వంద రోజులు దాటి పోయిందని భూముల నుంచి బలవంతంగా వెళ్లగొట్టి మూడున్నర నెలలు అయిందని ఐదు వందల కుటుంబాలు పరాయి గ్రామాల్లో తలదాచుకుంటున్నారని దేశంలో ఏ రాష్ట్రంలో ఇటువంటి దుస్థితి లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడేందుకు ఆస్తుల భద్రత, ప్రాణ రక్షణ కోసం జరిగే పోరాటం ఇది అని శాంతియుతంగా చలో ఆత్మకూరును నిర్వహిస్తున్నామని బాధితులకు న్యాయం చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని పార్టీ నేతలకు వివరించారు. మా ప్రాణాలు ఆస్తులకు రక్షణగా ఉండాలని బాధితులే అడుగుతున్నారని అందుకు తెలుగు దేశం నాయకత్వం అండగా వారికి వెన్నుదన్నుగా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. కార్యకర్తలు నాయకులను కాపాడుకోవడం రాజకీయ పార్టీల విధి అని ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలన్నీ మనగలగాలని పల్నాడులో మానవ హక్కుల ఉల్లంఘనను అందరూ ఖండించాలని ఆయన పిలుపు నిచ్చారు. టిడిపికి ఓటు వసిన వారిపై దాడులు దౌర్జన్యాలు అరాచకాలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. తమ పోరాటం ఇంతటితో ఆగదని అక్రమ కేసులను దీటుగా ఎదుర్కొని బాధితుల పక్షాన పోరాడతామని కార్యకర్తల ప్రాణాలకు ఆస్తులకు రక్షణగా ఉంటామని కూడా పార్టీ నేతలతో జరిగిన టెలి కాన్ఫరెన్స్ లో చంద్రబాబు స్పష్టం చేశారు.


అధికార పార్టీ వైఖరిపై ట్విటర్ లోనూ చంద్రబాబు విమర్శలు గుప్పించారు. గుంటూరులో బాధితులతో పునరావాస శిబిరం ఏర్పాటు చేస్తే పిడుగురాళ్లలో కౌంటర్ శిబిరం పెడతారంటూ చంద్రబాబు ట్విట్టర్ లో వైసీపీని ప్రశ్నించారు. ఐదేళ్ల క్రితం బాధితులకు ఇప్పుడు శిబిరం ఏర్పాటు చేయడం ఎక్కడైనా ఉందా అని ప్రశ్నిస్తూ తనను సవాలు చేయడం ఏమిటని ఆయన నిలదీశారు. ఇది సవాళ్ళు విసురుకొనే సందర్భం కాదని బాధితులను ఆదుకునే సమయం అని అందుకే చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చామని చంద్రబాబు స్పష్టం చేశారు. మరోవైపు వైసీపీ దాడులకు గురైన బాధితులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. గుంటూరులో టీడీపీ ఏర్పాటు చేసిన పునరావాస శిబిరంలో ఉంటున్న బాధితులు తమ గోడును కేంద్ర మంత్రికి చెప్పుకున్నారు.


వైసీపీ దాడులతో గ్రామాల్లో ఉండలేకపోతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పోలీసులు రక్షణ కల్పించటం లేదని ఆరోపించారు. దీంతో బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ అంశంపై ఐజీ డీజీపీలతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. చలో ఆత్మకూరు కార్యక్రమానికి పెద్దఎత్తున తరలి వెళ్లేందుకు టిడిపి నేతలు ఏర్పాట్లు చేసుకుంటూ ఉండటం బాధితులు కిషన్ రెడ్డిని కూడా కలిసి పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేయడంతో ఏపీ సర్కారులో కదలిక వచ్చింది.


ఇప్పటివరకు చంద్రబాబు డిమాండ్ చేసినట్టుగా బాధితుల శిబిరానికి వెళ్లాలనే ఆలోచన చేయని పోలీసులు మనసు మార్చుకున్నారు. పోలీసు అధికారుల బృందం వైసిపి బాధితుల శిబిరానికి వెళుతుందని వారిని స్వగ్రామాలకు తీసుకెళ్లి వారు శాంతి భద్రతలతో నివసించేలా చూస్తాని హోంమంత్రి సుచరిత ప్రకటించారు. దాడులపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నందున పిడుగురాళ్లలో ఓ స్పెషల్ ఆఫీసర్ ను కూడా నియమిస్తామని ప్రకటించారు. టిడిపి నేతల బృందం పల్నాడుకు వెళితే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే శాంతి భద్రతల రక్షణకు అందరూ సహకరించాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. పల్నాడు మొత్తం నూట నలభై నాలుగు సెక్షన్ విధించామని ప్రకటించారు. చలో ఆత్మకూరుకు పర్మిషన్ లేదని డీజీపీ వ్యాఖ్యానించారు. పోలీసుల తీరుపై తెలుగు దేశం పార్టీ ఏమాత్రం సంతృప్తిగా లేదు.



గతంలో రెండు సార్లు టిడిపి నేతలు చలో పల్నాడు సేవ్ డెమొక్రసీ పేరుతో గ్రామాలకు వెళ్లే ప్రయత్నం చేసినా పోలీసులే సర్ధిచెప్పారు. గ్రామాల్లో దాడులు జరగకుండా చూసుకుంటామని చెప్పారు కానీ, పరిస్థితి మెరుగుపడలేదు. పొనుగుపాడు అనే గ్రామంలో ఫలితాలు వచ్చిన రోజున టీడీపీ నేతలు ఇళ్ళకు వెళ్ళకుండా రోడ్డుకు అడ్డంగా గోడ కడితే ఇంత వరకూ తొలగించలేదు. ఈ క్రమంలో పోలీసులు రాజకీయ ప్రోద్భలంతో న్యాయం చేయడం లేదని, గ్రామాలలో టీడీపీ నేతలపై జరుగుతున్న దాడులకు  వత్తాసు పలుకుతున్నారని నమ్ముతున్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ చలో పల్నాడు కార్యక్రమాన్ని నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్నారు. దీంతో 11 వ తేదీన పల్నాడులో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ ప్రారంభమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: