స్టేషన్ ఘన్ పూర్ నియోజక వర్గం కేంద్రంగా సాగుతున్న రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు తమ బలాబలాలను నిరూపించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇన్ని రోజులు నిశబ్దంగా ఉన్న నియోజకవర్గంలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు అన్నట్టుగానే ఉందట వరంగల్ జిల్లా టీఆర్ ఎస్ లో మాజీ ఉపముఖ్యమంత్రులైన కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్యల వ్యవహారం. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు పార్టీ వర్గాలను తీసుకెళ్లే క్రమంలో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో వీరి మధ్య ఆధిపత్య పోరు బహిర్గతమైంది. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే టి రాజయ్య కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన కోసం పోటా పోటీగా వేరు వేరు తేదీలను ఖరారు చేసుకుని యాత్రలు చేపట్టారు.


స్టేషన్ ఘన్ పూర్ లో కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య మొదట్నుంచీ ప్రత్యర్థులే. ఈ నియోజకవర్గంలో కడియం శ్రీహరి టిడిపి తరఫున వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు, మంత్రిగా కూడా పని చేశారు. అదే నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ తరఫున తాటికొండ రాజయ్య కూడా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజీ ఆ తర్వాత టీఆర్ ఎస్ లో చేరారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో రాజయ్య, కడియం శ్రీహరి ప్రత్యర్థులుగా బరిలోకి దిగారు. ఈ పోరులో రాజయ్యదే పై చేయి అయ్యింది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారిన తర్వాత కడియం శ్రీహరి టిడిపికి గుడ్ బై చెప్పి టీఆర్ ఎస్ లో చేరారు. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఈ ఇద్దరు నేతలు వారి అనుచరుల మధ్య ఘర్షణ పూరిత వాతావరణమే కొనసాగింది.


రెండు వేల పద్నాలుగు ఎన్నికల తరవాత తాటికొండ రాజయ్య డిప్యూటీ సీఎంగా నియమితులయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా రాజయ్య కొనసాగిన సమయంలో కడియం శ్రీహరి అనుచరులకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకుండా కట్టడి చేసే ప్రయత్నం చేశారన్న ఆరోపణలున్నాయి. ఆరు నెలల తర్వాత వివిధ కారణాలతో రాజయ్యను ఆ పదవి నుంచి కేసీఆర్ తొలగించారు. అనంతరం అదే పదవిని కడియం శ్రీహరి కట్టబెట్టారు. అధిష్టానమే ఈ కీలక నిర్ణయం తీసుకున్న వీరిద్దరి మధ్య విబేధాలు మాత్రం తారస్థాయికి చేరుకున్నాయి. డిప్యూటీ సీఎంగా కొనసాగినన్ని రోజులూ కడియం శ్రీహరి స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గానికి దూరంగానే వున్నారు. రెండు వేల పధ్ధెనిమిదిలో జరిగిన ఎన్నికలకు ముందు కడియం శ్రీహరి వర్గీయులు టీఆర్ ఎస్ కార్యకర్తల ఆవేదన సభ పేరిట కార్యక్రమాలు నిర్వహించారు.


ఆవేదన సభలు కూడా ఇరువర్గాల మధ్య విభేదాలను మరింతగా రాజేశాయి. దీనితో కేటీఆర్ జోక్యం చేసుకుని రాజీ కుదిర్చారు. డాక్టర్ రాజయ్య నేరుగా వెళ్లి తనకు సహకరించాలని కడియం శ్రీహరిని కలిసి వేడుకున్నారు కూడా, ఆ ఎన్నికల సమయంలో ఇద్దరూ కలిసి పనిచేయగా రాజయ్య విజయం సాధించారు. ఎన్నికల సందర్భంగా ఈ రెండు వర్గాల మధ్య సఖ్యత కుదిరినట్టు కనిపించిన పంచాయతీ ప్రాదేశిక ఎన్నికల తరుణంలో పొరపొచ్ఛాలు మళ్లీ బహిర్గతమయ్యాయి.  టిక్కెట్ల కేటాయింపులో రాజయ్య పూర్తిగా కడియం శ్రీహరి అనుచరులను దూరం పెట్టారనే వాదన వినిపించింది. ఆ తర్వాత నుంచి మళ్లీ స్టేషన్ ఘన్ పూర్ లో గ్రూపుల పోరు షురూ అయ్యింది. ప్రస్తుతం ఈనియోజవర్గం ఎమ్మెల్యేగా తాటికొండ రాజయ్య వ్యవహరిస్తుండగా, ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కడియం శ్రీహరి కూడా స్టేషన్ ఘన్ పూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తానని ప్రకటించారు.



ఇలా ఈ ఆధిపత్య పోరు కొనసాగుతుండగా తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన యాత్ర వ్యవహారం రెండు వర్గాల మధ్య అంతరాన్ని మరోసారి బట్టబయలు చేసింది. ముందుగా కడియం శ్రీహరి ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులతో కాళేశ్వరం సందర్శన యాత్రకు తేదీని ప్రకటించారు. దీంతో అప్రమత్తమైన ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఆయన కంటే మూడు రోజుల ముందే కాళేశ్వరం సందర్శనకు తేదీని ఖరారు చేసి యాత్రను చేపట్టారు. ఇలా ఒకే నియోజక వర్గం నుంచి రాజయ్య, శ్రీహరి వేరు వేరు తేదీల్లో కాళేశ్వరం యాత్ర చేపట్టడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. ఈ ఆధిపత్య పోరు ఇంకెన్నాళ్లు కొనసాగుతుందో వచ్చే రోజుల్లో ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: