ఈ నెల 1 వ తేదీ నుండి కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల సవరణ చట్టంను అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చట్టం ఇంకా అమలు కావట్లేదు. కానీ ఈ చట్టం అమలవుతున్న రాష్ట్రాల్లో మాత్రం భారీగా చలానాలు వేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఒక ట్రక్ డ్రైవర్ నిబంధనలు పాటించని కారణంగా 86,500 రుపాయలు ట్రాఫిక్ పోలీసులు జరిమానా వేసినట్లు తెలిసింది. 
 
మరికొన్ని చోట్ల వాహనం కొన్న ధరల కంటే ట్రాఫిక్ చలానాలే ఎక్కువగా ఉన్నాయని కొందరు వాహనాలను వదిలివెళ్ళగా మరికొందరు వాహనాలను కాల్చివేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ చట్టం అమలులోకి వచ్చిన తరువాత ఒక్క చిన్న కాగితం లేకపోయినా భారీగా జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఇలా భారీగా ట్రాఫిక్ చలానాలు పడుతున్న సమయంలో గుజరాత్ కు చెందిన వ్యక్తి వాహనానికి సంబంధించిన కాగితాలన్నీ హెల్మెట్ కు అతికించటం విశేషం. 
 
గుజరాత్ రాష్ట్రంలోని వడోదర ప్రాంతానికి చెందిన రామ్ షా వృత్తిరిత్యా ఇన్సూరెన్స్ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు. ఇన్సూరెన్స్ ఏజెంట్ కాబట్టి రోజంతా బైక్ పై చాలా ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. కొత్త మోటారు వాహనాల చట్టం అమలులోకి రావటంతో బైక్ కు సంబంధించిన ఏ ఒక్క పేపర్ లేకపోయినా భారీ స్థాయిలో జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. బైక్ పై వెళ్లే సమయంలో ఎలాంటి సమస్యలు ఉండకూడదని రామ్ షా బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. 
 
బైక్ పై ఎక్కడికి వెళ్లినా తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వెళ్లాల్సిందే. అలాంటపుడు బండికి సంబంధించిన పేపర్లన్నీ హెల్మెట్ కే అతికించేస్తే సరిపోతుంది కదా అని ఆలోచించాడు. హెల్మెట్ కు కాగితాలను అతికించటం ద్వారా ట్రాఫిక్ పోలీసులు ఆపినా తక్కువ సమయంలోనే అన్ని పేపర్లను చూపించవచ్చని ఆలోచించి నిర్ణయాన్ని అమలుచేశాడు. రామ్ షా ప్రయత్నాన్ని చూసి ట్రాఫిక్ పోలీసులు కూడా అభినందిస్తూ ఉండటం విశేషం. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: