గుంటూరు జిల్లా పలనాడు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఇచ్చిన చలో ఆత్మకూరు పిలుపుతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. తెలుగు దేశం కుట్ర రాజకీయాలను బయటపెడతామంటూ పోటా పోటీగా వైసీపీ కూడా చలో ఆత్మకూరు పిలుపు ఇవ్వడంతో పలనాడు ప్రాంతంలో టెన్షన్ పెరిగింది.


గుంటూరు నగరంతో పాటు పల్నాడులో పోలీసు హై అలర్ట్ ప్రకటించారు. తెలుగు దేశం చలో ఆత్మకూరు పిలుపు నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు . తెలుగు దేశం నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం నేతలు బయటకు రాకుండా గృహ నిర్బంధం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. పల్నాడు ప్రాంతంలో దాడుల బారిన పడిన బాధితుల గుర్తింపు సహా వారికి ప్రశాంతంగా జీవించేలా చేసేందుకు నిజనిర్దారణ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిన్న హోం మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులు పల్నాడు ప్రాంతంలో పునరావాస కేంద్రాలను సందర్శించి నిజమైన బాధితులు, పెయిడ్ ఆర్టిస్టులు ఎవరనేది తేల్చుతారని అన్నారు. బాధితులు ఎవరైనా ఉంటే వారి గ్రామాలకు తీసుకెళ్లి ప్రశాంతంగా జీవించేలా నిజనిర్దారణ బృందం చర్యలు తీసుకుంటారని తెలిపారు.


తెలుగు దేశం పాలనలో గడచిన ఐదేళ్లలో రాష్ట్రంలో రాక్షస పాలన జరిగిందని ఆరోపించారు. 6 రాజకీయ హత్యలు జరిగాయని ఆరోపించారు. పల్నాడులో గతంలో అనేక దారుణాలు జరిగాయి అధికారంలోకి వచ్చాక ఎక్కడా రాజకీయ హత్యలు జరగలేదన్నారు. పోలీసులు నిస్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్న ఆమె దాడులపై ఏ పార్టీ వారు ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.


మరి తాజాగా రెండు పార్టీలు చలో ఆత్మకూరు పేరుతో పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో గుంటూరు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇది ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో అన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: