చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని చంద్రబాబునాయుడు విరమించుకున్నట్లేనా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే అనుమానం వస్తోంది. ఎందుకంటే ఉదయం ఆత్మకూరుకు బయలుదేరిన చంద్రబాబును పోలీసులు కరకట్ట మీద ఇంట్లో నుండి బయటకు రానీయలేదు. తన కారులో చంద్రబాబు బయలుదేరినా పోలీసులు మెయిన్ గేట్లకు తాళాలేసేశారు. దాంతో ఇంట్లో నుండి చంద్రబాబు బయటకు రాలేకపోయారు.

 

తనను పోలీసులు హౌస్ అరెస్టు చేస్తారని చంద్రబాబుకు ముందే తెలుసు. అయినా తన కాంపౌండ్ లోనే కాస్త హడావుడి చేశారు. ముందు నేతలతో మాట్లాడారు. తర్వాత మీడియాతో మాట్లాడారు.  ఇంటి గేట్లకు పోలీసులు తాళాలు వేసేసిన విషయం తెలిసి కూడా కారులో ఆత్మకూరుకు వెళుతున్నట్లు బిల్డప్ ఇచ్చారు.

 

సుమారు అర్ధగంట పాటు కారులోనే చంద్రబాబు కూర్చున్నా పోలీసులు బయటకు పంపలేదు. దాంతో చేసేది లేక కారులో నుండి బయటకు వచ్చి మళ్ళీ మీడియాతో మాట్లాడారు. తనను ప్రభుత్వం హౌస్ అరెస్టు చేయటం చాలా దుర్మార్గమంటూ మండిపోయారు. తనను కలవనీయకుండా టిడిపి నేతలను అరెస్టులు చేయటమేంటంటూ నిలదీశారు.

 

సరే మళ్ళీ ఓ 15 నిముషాల పాటు నాటకీయ స్పీచ్ తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోయారు. తనను పోలీసులు ఎప్పుడు బయటకు వెళ్ళనిస్తే అప్పుడే ఆత్మకూరుకు వెళతానని ప్రకటించటం చూస్తుంటే చంద్రబాబు కార్యక్రమాన్ని వదిలేసినట్లే అనిపిస్తోంది. నిజానికి మంగళవారం రాత్రి నుండి పోలీసు, రెవిన్యు అధికారులు గుంటూరులో టిడిపి ఏర్పాటు చేసిన శిబిరంలో చర్చలు మొదలుపెట్టారు.

 

అదే సమయంలో ఇతర గ్రామాల్లో కూడా రెండు పార్టీల నేతలు, కార్యకర్తలతో చర్చించారు. కొన్ని గ్రామాల్లో  రెండు పార్టీల కార్యకర్తల మధ్య సయోధ్య కూడా చేశారు. ఆ విషయాలను రెండు పార్టీల్లోను గొడవలు పడిన కార్యకర్తలు, స్ధానిక నేతలే అంగీకరించారు. ఈ విషయాలు తెలిసి కూడా చంద్రబాబు కావాలనే పెద్ద ఇష్యు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: