ప్రస్తుతం ఏదైన వైరల్ కావాలంటే అది సోషల్ మీడియా అనే చెప్పుకోవాలి. ముందుగా వచ్చేది సోషల్ మీడియాలోనే. ఇక రాజకీయ అంశమైతే..ఇంకేముంది అది నిజమా..? కాదా అనేది తెలియకున్నా..తెగ వైరల్ అవుతుంటాయి. రాజకీయాల్లో కొందరు సంతృప్తి చెందుతుంటే..మరి కొందరు అసంతృప్తి చెందుతుంటారు. అయితే టీఆర్ ఎస్ లో కొద్ది రోజులుగా నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. మంత్రి పదవి దక్కని కొందరు టీఆర్ఎస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడం... వారిని టీఆర్ఎస్ పార్టీ సముదాయించడం, బుజ్జగించడం వంటివి కొన్ని రోజులుగా జరుగుతోంది. అయితే ఇప్పుడు ఓ ఎమ్మెల్యేపై సోషల్ మీడియాలో పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఎవరూ ఊహించని విధంగా బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ను కలవడం రాజకీయంగా తీవ్ర సంచలనంగా మారింది. మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న షకీల్ బీజేపీ ఎంపీని కలవడంతో... ఆయన పార్టీ మారతారేమో అనే వార్త జోరుగా కొనసాగుతోంది. అయితే నిజామాబాద్ మాజీ ఎంపీ కవితకు సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్న షకీల్ ఎంపీ ధర్మపురి అరవింద్‌ను కలవడం ‘కారు’ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

 

ఎంపీ అరవింద్ ఏమన్నారంటే…

తనను షకీల్  కలిసిన విషయాన్నిఎంపీ అరవింద్ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశారు. తన నివాసంలో ఈరోజు తనను షకీల్ కలిశారని, రాష్ట్రంలోని, జిల్లాలోని తాజా రాజకీయ పరిస్థితులు, పలు విషయాలపై చర్చించినట్లు తన ఖాతాలో చెప్పుకొచ్చారు అరవింద్. ఈ సందర్భంగా అరవింద్ కు షకీల్ శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఫొటోను అరవింద్ పోస్ట్ చేశారు.

 

పార్టీకి దూరంగా…అసంతృప్తి వ్యక్తంగా

కాగా కొంత కాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న షకీల్ తనకు మంత్రి పదవి దక్కకపోవడంతోనే అసంతృప్తితో ఉన్నారని రాజకీయ నేతలు చెప్పుకొంటున్నమాట. అయితే షకీల్... ఏదైనా ఓ నామినేటెడ్ పదవి ఇస్తామనే విషయంలోనూ టీఆర్ఎస్ నాయకత్వం తనకు హామీ ఇవ్వకపోవడంపై కాస్త అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ కారణంగానే ఆయన పార్టీపై ఒత్తిడి తెచ్చే క్రమంలో నిజామాబాద్‌కు చెందిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ను కలిశారని ప్రచారం జరుగుతోంది. అయితే మైనార్టీ సామాజికవర్గానికి చెందిన షకీల్ బీజేపీలో చేరే అవకాశం లేదని... కేవలం టీఆర్ఎస్ అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకే ఆయన ఈ రకమైన నిర్ణయం తీసుకుని ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే షకీల్ కావడంపై మొత్తానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ బీజేపీ ఎంపీని కలవడంపై ఆ పార్టీ అధినాయకత్వం ఏ రకంగా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: