పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు లభించడం లేదని బోధన్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే షకీల్‌  ఆవేదన వ్యక్తం చేశారరు. ఆయన గురువారం బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా షకీల్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్న పరిస్థతుల్లో అక్కడ ఉండలేకపోతున్నానని, రాజీనామాకు కూడా సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ వల్లే గెలిచానని, అయితే ఆయనను కొందరు తప్పుదారి పట్టిస్తున్నారని షకీల్‌ వ్యాఖ్యలు చేశారు.

 

మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యే షకీల్‌...బీజేపీ గూటికి చేరతారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీతో ఆయన భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారని హమీ ఇచ్చారని.. టీఆర్ఎస్ లో తాను ఏకైక ముస్లిం ఎమ్మెల్యేగా ఆయన గుర్తు చేశారు. తమ పార్టీ నేతలు ఎంఐఎం నేతలు చెప్పినట్టుగా వింటున్నారని ఆయన ఆరోపించారు. అరవింద్ తో అన్ని విషయాలు మాట్లాడానని, సోమవారం అన్ని బయటపెడతానని ఎమ్మెల్యే షకీల్‌ చెప్పారు.

 

అసంతృప్తులపై ఎంపీ అరవింద్ ఆరా

టీఆర్ఎస్ లో ఎవరెవరు అసంతృప్తిగా ఉన్నారనే అంశంపై షకీల్ తో అరవింద్ ఆరా తీశారనే ప్రచారం సాగుతుంది. మంత్రి పదవి దక్కని కారణంగా ఇప్పటికే అసంతృప్తితో కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. మాజీ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, జోగు రామన్న, మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి రాజయ్యలు బహిరంగంగానే ఈ విషయమై తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. జోగు రామన్న, రాజయ్య,  నాయిని నర్సింహ్మారెడ్డిలతో టీఆర్ఎస్ నాయకత్వం చర్చించింది. బుధవారం నాడు అసంతృప్త నేతలు టీఆర్ఎస్ భవనంలో కేటీఆర్ తో సమావేశమయ్యారు. అసంతృప్తి వాదులను బుజ్జగిస్తున్న తరుణంలోనే షకీల్ బీజేపీ ఎంపీతో భేటీ కావడం మరింత ప్రాధాన్యతను సంతరించుకొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: