కాంగ్రెస్ ట్ర‌బుల్ షూట‌ర్‌గా పేరొందిన‌...కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌కు ఊహించ‌ని రీతిలో మ‌ద్ద‌తు ద‌క్కింది.  డీకే శివకుమార్‌ను హవాలా లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్ట్‌చేసింది. అయితే,  హవాలా లావాదేవీల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్న కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌కు సంఘీభావంగా ఆయన సామాజిక వర్గానికి చెందిన వొక్కలిగలు రాజ్‌భవన్ ఛలో పేరుతో బెంగళూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. 


బెంగళూరులోని నేషనల్ కాలేజీ నుంచి మొదలైన ఈ ర్యాలీ.. ఫ్రీడం పార్క్ వరకు, అక్కడ నుంచి రాజ్‌భవన్‌కు సాగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బెంగళూరుకు తరలి వచ్చిన వొక్కలిగ సంఘాల ప్రతినిధులు శివకుమార్ పోస్టర్లు, బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ, బీజేపీ వ్యతిరేక నినాదాలు చేశారు.


కాగా, తన అరెస్ట్‌ విషయమై శివకుమార్‌ స్పందిస్తూ తనను అరెస్ట్‌ చేయాలన్న లక్ష్యాన్ని విజయవంతం చేసుకున్న తన ‘బీజేపీ మిత్రులను’ అభినందిస్తున్నానని ట్వీట్‌ చేశారు. ‘నాకు వ్యతిరేకంగా ఐటీ, ఈడీ నమోదు చేసిన కేసులు రాజకీయ ప్రేరేపితం. నేను బీజేపీ ప్రతీకార, కక్ష సాధింపు రాజకీయాల బాధితుడ్ని. నాకు దేవుడిపై, న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది. కక్ష సాధింపు చర్యలపై విజయం సాధించి బయటకు వస్తా’ అని ధీమా వ్యక్తం చేశారు. శివకుమార్‌ ఏ ఆర్థిక నేరాలకు పాల్పడలేదని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి వీఎస్‌ ఉగ్రప్ప అన్నారు. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు దినేశ్‌ గుండూరావు స్పం దిస్తూ శివకుమార్‌కు పార్టీ అండగా నిలుస్తుందన్నారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా స్పంది స్తూ.. ఆర్థిక ఎమర్జెన్సీ నుంచి దేశం దృష్టి మళ్లించేందుకే శివకుమార్‌ను కేంద్రం అరెస్ట్‌ చేయించిందన్నారు. జేడీఎస్‌ నేత, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి స్పందిస్తూ విపక్ష నేతలను అణగదొక్కేందుకు దర్యాప్తు సంస్థలను కేంద్రం వాడుకుంటున్నదన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: