ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలిని వైసీపీ సర్కార్ ఏర్పాటు  చేసేందుకు రెడీ అవుతోంది.  ఈ మేరకు తాజాగా  సర్కార్ ఆర్డినెన్స్ జారీ చేసింది. మొత్తం 29 మంది సభ్యులతో టీటీడీ పాలకవర్గం ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆర్డెనెన్స్ లో వెల్లడించారు.  మొత్తం మీద చూసుకుంటే టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి నియామకం జరిగిన రెండు నెలల తరువాత పాలకమండలి ఏర్పాటు చేస్తూ వైసీపీ సర్కార్ నిర్ణయం తీసుకుంటోంది.


మొత్తం 29 మంది పాలకమండలి సభ్యుల్లో పాతిక మంది సభ్యులుగా ఉంటారు,  నలుగురు అధికారులతో కలుపుకుని ఆ సంఖ్య 29 కి చేరుకుంటుంది. ఇందులో ఎవరెవరు ఉంటారన్నది ఇంకా నిర్ధారణ కాకపోయినప్పటికీ తెలంగాణా నుంచి ప్రముఖ నిర్మాత దిల్ రాజు తో పాటు మై హోమ్స్  అధినేత జూపల్లి రామేశ్వరరావు కచ్చితంగా ఉంటారని అంటున్నారు. ఇక మోడీ, అమిత్ షా కొటాలో మరో ఇద్దరు ఉంటారని, తమిళనాడు, కర్నాటకల నుంచి కూడా మరో ఇద్దరికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. అదే విధంగా చూసుకుంటే ఏపీలో వివిధ కారణాల వల్ల పదవులు పొందలేకపోయిన వారు, ఎమ్మెల్యేలను   కూడా పాలకమండలి మెంబర్స్ నియమించే అవకాశం ఉంది.


విశాఖ జిల్లా నుంచి ఎలమంచిలికి చెందిన సీనియర్ ఎమ్మెల్యే కన్నబాబురాజుకు టీటీడీ పాలకమండలిలో స్థానం లభిస్తున్నట్లుగా చెబుతున్నారు. అదే విధంగా నెల్లూరుకు చెందిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరెడ్డి సతీమణీకి కూడా అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరెడ్డి, విజయవాడకు చెందిన ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు చాన్స్ ఇస్తారా అన్నది చూడాలి మరి. ఆర్డినెన్స్ వచ్చింది కాబట్టి రేపో మాపో సభ్యుల పేర్లతో జాబితా విడుదల అవుతుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: