ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ మంత్రాన్ని రాష్ట్రంలో మ‌రింత వేగంగా అమ‌లు చేసేందుకు బీజేపీ సిద్ధ‌మైంది.  2023 ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో అధికారాన్ని ద‌క్కించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా త‌గిన వ్యూహాలు అమ‌లు చేస్తోంది. ఇందుకోసం భారీగా బ‌ల‌గాన్ని పెంచుకునే ప‌నిలో నిమ‌గ్న‌మైంది. కాంగ్రెస్‌, టీడీపీల నుంచి వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హించిన ఆ పార్టీ నేత‌లు ఇక అధికార పార్టీపైనే గురిపెట్టారు.  ఏకంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను త‌మ పార్టీలోకి తీసుకొచ్చేందుకు సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు.


మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఇటీవ‌ల అధికార పార్టీలో అసంతృప్తిని రాజేసింది. దీనిని త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకునేందుకు బీజేపీ పావులు క‌దుపుతోంది.  అసంతృప్తితో ఉన్న అధికార పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల‌ను చేర్చుకోవ‌డం ద్వారా రాష్ట్రంలో తామే ప్ర త్యామ్నాయం అన్న‌ సంకేతాల‌ను రాజ‌కీయ వ‌ర్గాల్లోకి తీసుకెళ్లాల‌ని బీజేపీ యోచిస్తోంది. ఇప్ప‌టికే పలువురు ప్ర‌జాప్ర‌తినిధుల‌తో ఆ పార్టీ అగ్ర‌నేత‌లు కీల‌క చ‌ర్య‌లు జ‌రిపిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.


ఈ క్ర‌మంలోనే నిజామాబాద్ జిల్లా బోధ‌న్ టీఆర్ ఎస్ శాస‌న‌స‌భ్యుడు ష‌కీల్‌తో నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ భేటీ కావ‌డం గులాబీ శిబిరంలో క‌ల‌క‌లం రేపింది. మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేద‌ని అసంతృప్తితో ఉన్న ష‌కీల్‌.. ఎంపీ అర్వింద్‌ను క‌ల‌వ‌డం రాజ‌కీయ వర్గాల్లో ఆస‌క్తి రేపుతోంది. బీజేపీ నేత‌తో భేటీ కావ‌డం, అన్ని విష‌యాల‌ను సోమ‌వారం వెల్ల‌డిస్తాన‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. ష‌కీల్ బీజేపీలో చేర‌డం ఖాయ‌మ‌ని, ఆయ‌న తోపాటు మ‌రికొంద‌రు అధికార పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు క‌మ లం గూటికి వెళ‌తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.


అంతేగాక ప‌లువురు టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల‌తో ఢిల్లీ నేత‌లే కీలక చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం. కొంద‌రు సీనియ‌ర్ నేత‌లు కూడా ఈ జాబితాలో ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. త్వ‌ర‌లోనే వీరంతా పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షా స‌మ‌క్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకుంటార‌ని ఆపార్టీ నేత‌లు పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఏదేమైనా భ‌విష్య‌త్తులో తెలంగాణ రాజ‌కీయాల్లో పెను ప్ర‌కంప‌న‌లు చోటు చేసుకోవ‌డం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: