సూర్యాపేటలో పేలుడు ఘటన కలకలం సృష్టిస్తోంది. అయ్యప్పస్వామి గుడికి దగ్గరలోని పాత ఇనుప సామాన్ల దుకాణంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో బీహార్ కు చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులకు పేలుడు సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఘటనపై విచారణ జరుపుతున్నారు. 
 
సూర్యాపేట జిల్లాలోని వెంకట సాయి ప్లాస్టిక్ హౌస్ లో ఈ పేలుడు సంభవించింది. దాదాపు ఎకరం స్థలంలో ఈ పాత ఇనుప సామాన్ల షాపును నిర్వాహకులు నిర్వహిస్తున్నారు. ఒక ప్లాస్టిక్ డబ్బాలో బాంబు పేలుడుకు సంబంధించిన కెమికల్స్ ఉండటంతో పెద్ద ఎత్తున పేలుడు సంభవించినట్లు సమాచారం. ఈ పేలుడులో బీహార్ కు చెందిన రామ్ చంద్ర సాహూ అక్కడికక్కడే మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్ కు చెందిన యువకుడు, సూర్యాపేటకు చెందిన మరో వ్యక్తి తీవ్రంగా గాయలపాలయినట్లు తెలుస్తోంది. 
 
ఈ ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరు ప్రస్తుతం సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 11 : 30 గంటల సమయంలో సూర్యాపేటలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ పేలుడు శబ్దంతో ఈ ప్రాంతం చుట్టూ ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురి అయ్యారని సమాచారం. ఈ పాత ఇనుప సామాన్ల షాపు పక్కనే పెట్రోల్ బంకు కూడా ఉంది. 
 
గడచిన మూడు సంవత్సరాలుగా నాగరాజు అనే వ్యక్తి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి ఈ వ్యాపారం నిర్వహిస్తున్నాడని తెలుస్తోంది. 35 మంది కూలీల ద్వారా నాగరాజు వివిధ ప్రాంతాల నుండి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తాడని సమాచారం. హైదరాబాద్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకు ప్లాస్టిక్ వ్యర్థాలను తరలిస్తాడని తెలుస్తోంది. సంఘటనా స్థలానికి డీఎస్పీ, సీఐ చేరుకొని పరిశీలిస్తున్నారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నట్లు సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: