నిజామాబాద్ ఎంపీ అరవింద్ ను కలిసి పార్టీ మారనున్నట్లు సంకేతాలిచ్చిన బోధన్ ఎమ్మెల్యే షకీల్ , అప్పుడే మాట మార్చారు . టీఆరెస్ లో పని చేసే వారికీ గౌరవం లేదని , ఆత్మాభిమానం లేని చోట తాను కొనసాగలేనని చెప్పిన షకీల్, ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ ను వీడేది లేదని చెప్పుకొచ్చారు . ఎం ఐ ఎం చెప్పినట్లు టీఆరెస్ నాయకత్వం నడుచుకుంటుందని , తనకు హక్కు ఉంది కాబట్టే మంత్రి పదవి అడుగుతున్నానని పేర్కొన్న షకీల్ , మంత్రి పదవి కావాలని తాను  ఎప్పుడూ సీఎం కేసీఆర్ ను అడగలేదన్నారు . తాను టీఆరెస్ వీడి   బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఎమ్మెల్యే షకీల్ ఖండించారు .


 బోధన్ లో అభివృద్ధి పనుల ప్రారంభోత్వానికి ఆహ్వానించేందుకు మాత్రమే ఎంపీ అరవింద్ తో భేటీ కావడం జరిగిందన్నారు . సీఎం కేసీఆర్ తనకు  పొలిటికల్ గాడ్ ఫాదర్ అని పేర్కొన్న అయన , సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని అన్నారు . కేసీఆర్ తనకు  మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీకి అవకాశం ఇచ్చారని , 2009 లో  ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయిన తనపై ఉన్న నమ్మకంతోనే 2014 మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని ఇచ్చారన్నారు . తాను జీవితమంతా సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటానని  ఎమ్మెల్యే షకీల్ చెప్పారు .


 తాను బతికినంత కాలం టీఆర్ఎస్ లోనే కొనసాగుతానని పార్టీ మారే ప్రసక్తే లేదని అన్నారు . ఎంపీ అరవింద్ తో భేటీ అనంతరం షకీల్, పార్టీ మారనున్నట్లు సంకేతాలను ఇచ్చారు . అంతటితో ఆగకుండా సోమవారం పార్టీ మారే అంశం గురించి అన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు. అయితే రాత్రికి రాత్రే షకీల్ మనస్సు మారడం వెనుక అనర్హత వేటు భయమే కారణమని తెలుస్తోంది .


మరింత సమాచారం తెలుసుకోండి: