ఛలో ఆత్మకూరు' కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి వైసీపీ ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని వాడుకొందని, టీడీపీ నాయకుల అరెస్ట్‌లను, ఆ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలను కూడా రాజకీయంగా వాడుకోవడానికి జగన్‌ అండ్‌ కో ప్రయత్నించడం దురదృష్టకరమని తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఛలో ఆత్మకూరు' నేపథ్యంలో రాష్ట్ర మహిళా కమిషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి అరెస్ట్‌ సమయంలో, ఆమె మహిళా ఎస్సైని కులం పేరుతో దూషించిందని, 'ఛలో ఆత్మకూరు' అంశాన్ని తప్పుదోవ పట్టించడానికే ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని సునీత తెలిపారు.


టీడీపీ చేపట్టిన కార్యక్రమాన్ని పలుచన చేసేలా, రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు చేస్తున్న దాడులు బయటకు రానివ్వకూడదనే ఉద్దేశంతోనే, ప్రభుత్వం ఈతరహా దుర్మార్గపు ప్రచారానికి పాల్పడుతోందన్నారు. రాజకుమారిని అరెస్ట్‌ చేసే సమయంలో ఉన్న మహిళాఎస్సైది ఏ కులమో , ఆ సమయంలో ఉన్న టీడీపీ మహిళానేతలకు ఎలా తెలుస్తుందని, పోలీస్‌ ఉద్యోగంలో ఉన్న ఆమె, తన విధులకు విరుద్ధంగా రాజకీయాలు చేయడం ఎంతమాత్రం భావ్యం కాదని సునీత సూచించారు. 


రాజకీయాల్లో ఎంతో అనుభవమున్న మహిళానాయకురాలైన రాజకుమారి  ఎవరి పట్లయినా చాలా హుందాగా వ్యవహరిస్తారన్నారు. నన్నపనేని సహా,  తెలుగుదేశమనే కుటుంబంలో ఉండే మహిళానేతలమైన తామందరం, ఎప్పుడూ ఎక్కడా కూడా ఎవరినీ కులం, మతం పేరుతో దూషించలేదని, అసలు అలాంటి దూషణలు, భాషణలు తెలుగుదేశం సంస్కృతికే విరుద్ధమని సునీత స్పష్టం చేశారు. ఎస్సీలకు ఉన్నతపదవులు ఇచ్చి గౌరవించిన ఘనత తెలుగు దేశానికే దక్కుతుందని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అనేక కార్యక్రమాలు    చేపట్టిన చరిత్ర తమ పార్టీకే ఉందన్నారు. 


కేవలం వ్యక్తిగత స్వలాభం కోసం కులాల మధ్య కుంపట్లు రాజేసేలా మంగళగిరి శాసనసభ్యులు ప్రయత్నించడం ఆయన స్థాయికి తగదని సునీత హితవుపలికారు. కులమతాలకు అతీతంగా వైసీపీ బాధితులకు న్యాయం చేయడానికి  తలపెట్టిన 'ఛలో ఆత్మకూరు' కార్యక్రమంలో పాల్గొన్న తామందరం కులాల ప్రస్తావన ఎందుకు తీసుకొస్తామని, బుద్ధిలేకుండా సామాజికవర్గాల పేరుతో దూషణలు ఎందుకు చేస్తామని ఆమె  ప్రశ్నించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: