- నేడు తొలి సీఎం బూర్గుల రామకృష్ణారావు వర్థంతి

-హైదరాబాద్ ముఖ్యమంత్రిగా  పదవి బాధ్యతలు

- కేరళ, ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా ఎన్నిక


నైజాం రాజ్యంపై కలం పట్టి కవులతో కవాతు చేయించిన న్యాయవాది మన బూర్గుల రామకృష్ణారావు. ఈయన తెలుగువారి తొలి ముఖ్యమంత్రి. మార్చి 13, 1899లో జన్మించిన బూర్గుల, సెప్టెంబర్ 14, 1967 మరణించారు. బహుభాషావేత్త, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, రచయిత, న్యాయవాది. హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి. అలాగే కేరళ , ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు గవర్నర్ గా కూడా పనిచేశారు. నేడు ఆయన వర్థంతి సందర్భంగా ప్రత్యేక కథనం.

 

జననం - విద్యాభ్యాసం

రామకృష్ణరావు 1899 మార్చి 13 న నరసింగరావు, రంగనాయకమ్మ దంపతులకు కల్వకుర్తి దగ్గరలోని పడకల్ గ్రామంలో జన్మించాడు. వీరి స్వగ్రామం బూర్గుల. ఇంటి పేరు పుల్లం రాజు వారు. అయితే స్వగ్రామమైన బూర్గుల నామమే వీరి ప్రఖ్యాత గృహనామమైనది. ధర్మపంత్ స్కూలు (హైదరాబాద్) లో ప్రాథమిక విద్యను అభ్యసించాడు. 1915లో మెట్రిక్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. పూణె లోని ఫెర్గూసన్ కళాశాలలో బీఏ (హానర్స్) డిగ్రీ చదివారు. బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ (లా డిగ్రీ) పూర్తిచేసి, హైదరాబాద్‌లో న్యాయవాది వృత్తిని ప్రారంభించారు. బూర్గుల దగ్గర పివి.నరసింహారావు జూనియర్ లాయర్‌గా పనిచేశాడు.

 Image result for burugula ramakrishna rao

రాజకీయ జీవితం :

1912లో వివాహం జరిగింది. ఆమె 1920లో మరణించడంతో, 1924లో మళ్ళీపెళ్ళి చేసుకున్నారు. 1923లో హైదరాబాద్ లోని న్యాయవాద వృత్తి ప్రారంభించి అగ్రస్థాయికి చేరాడు. న్యాయవాదిగా ఉంటూనే, రాజకీయ జీవితాన్ని కూడా ప్రారంభించారు. ఆంధ్రోద్యమం, గ్రంథాలయోద్యమం, భూదానోద్యమం మొదలైన వాటిలో పాల్గొన్నాడు. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి మొదలైన వారితో కలిసి పనిచేసాడు. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయంకు అధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేసాడు.

 

కాంగ్రెస్ వ్యవస్థాపకుల్లో ప్రముఖుడు :

హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవస్థాపకుల్లో బూర్గుల ప్రముఖుడు. పార్టీ తరపున ఆయన అనేక కార్యక్రమాలకు నేతృత్వం వహించాడు. 1931లో నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన రెండవ ఆంధ్రమహాసభకు బూర్గుల అధ్యక్షత వహించాడు. శాసనోల్లంఘన ఉద్యమంలోను, క్విట్ ఇండియా ఉద్యమంలోను పాల్గొని కారాగారవాసం అనుభవించాడు. 1948లో పోలీసు చర్య తరువాత హైదరాబాద్ రాష్ట్రం ఏర్పాటై, వెల్లోడి ముఖ్యమంత్రిగా సైనిక ప్రభుత్వం ఏర్పడినప్పుడు, ఆయన రెవెన్యూ, విద్యాశాఖల మంత్రిగా పని చేశారు. రెవెన్యూ మంత్రిగా వినోబాభావే ప్రారంభించిన భూదానోద్యమానికి చట్టబద్దత కల్పించారు.

 

1952లో షాద్ నగర్ నియోజకవర్గం నుంచి ఎన్నిక:

1952లో మొదటిసారి హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నికలు జరిగినప్పుడు, మహబూబ్‌నగర్ జిల్లాలోని షాద్‌ నగర్ నియోజకవర్గం నుంచి హైదరాబాద్ శాసనసభకు ఎన్నికయ్యారు బూర్గుల. ఆ ఏర్పడిన ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయ్యారు. పూర్తి మెజారిటీ లేకున్ననూ, మంత్రివర్గంలో సంపూర్ణ సహకారం లేకున్ననూ, పరిపాలనధక్షుడైన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. 1956లో హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను విడదీసి, కోస్తా, రాయలసీమ లతో కలిపి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు అయినప్పుడు, కొత్త రాష్ట్రానికి నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 1948 జనవరిలో ప్రభుత్వ ఏజెంట్ జనరల్‌గా హైదరాబాద్ వచ్చిన కె.యం. మున్షీని నిజాం ఆజ్ఞలకు విరుద్ధంగా అందరికన్నా ముందే సందర్శించి పాలకుల ఆగ్రహానికి గురయ్యారు. ఆ సంవత్సరంలోనే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకుడై ప్రజా ఉద్యమానికి సారథ్యం వహించాడు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడానికి కృషి చేసిన తీరు విశేషమైనదిగా చెప్పవచ్చు. రాజకీయ రంగంలోనే కాకుండా సాంఘిక సాంస్కృతిక రంగాల్లో కూడా ఈయన అనేక సేవలు చేశారు.

 

Image result for burugula ramakrishna rao

భూ సంస్కరణలకు శ్రీకారం..

హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బూర్గుల సంక్షేమానికి బాటలు వేశారు. చారిత్రాత్మకమైన భూ సంస్కరణకు శ్రీకారం చుడుతూ హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాద్ వ్యవసాయ కౌలుదారీ చట్టం 1950కి తీసుకు వచ్చారు. కౌలురైతులకు, భూమిలేని పేదలకు వ్యవసాయ భూమిపై హక్కులు కల్పించిన ఈ చట్టం దేశంలో భూ సంస్కరణ చట్టాలకు మార్గదర్శకంగా నిలిచింది. 1956లో భాషా ప్రయుక్త రాష్ర్టాలకు భారత ప్రభుత్వం మొగ్గుచూపింది. ఈ ప్రయోగాన్ని హైదరాబాద్, ఆంధ్ర రాష్ర్టాలపై మొదటి సారిగా ప్రయోగించింది. ఈ ప్రయోగంతో రెండు రాష్ర్టాల్లోని తెలుగు భాష మాట్లాడే ప్రజలు అత్యధికంగా ఉన్న భూభాగాలను కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. నూతన రాష్ట్ర ఆవిర్భావంతో హైదరాబాద్ స్టేట్ ప్రభుత్వం రద్దయింది. తర్వాత బూర్గులను కేరళ రాష్ర్టానికి గవర్నర్‌గా భారత ప్రభుత్వం నియమించింది. 1956 నుంచి 1960 వరకు కేరళకు గవర్నర్‌గా, అనంతరం ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా రెండేళ్లపాటు పనిచేశారు. 1962లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. నాలుగేళ్లపాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. 1967లో సెప్టెంబరు 14న బూర్గుల కన్నుమూశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: