పాలకుడు చేతికానివాడైతే.. రాజ్యం అల్లకల్లోలంగా ఉంటుంది. పాలకుడు పాలనపై సరిగ్గా దృష్టిపెడితే.. ఆ రాజ్యం అన్నిరంగాల్లోనూ సుభిక్షంగా ఉంటుంది. ఈ సూత్రం కేవలం పాలకుడికి, రాజ్యానికి మాత్రమే వర్తించదు. అధికారం చేతిలో ఉన్న ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. ఇప్పుడు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీలో అదే జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు విద్యావేత్తలు.


విశ్వ విద్యాలయం పాలనలో కీలకమైన అధికారాలు చేతిలో ఉండే వ్యక్తి యూనివర్శిటీ రిజిస్ట్రార్. ఆయన నీతి,నిజాయితీగా విశ్వవిద్యాలయ అభివృద్ధి పట్ల అంకిత భావం, నిబద్దక కలిగి ఉంటే.. యూనివర్శిటీలో అన్ని విభాగాలు సక్రమంగా పనిచేస్తాయి. లేకపోతే.. ఎవడి రాజ్యం వాడిది అన్నట్టుగా సాగుతాయి. కొత్త వచ్చిన ఇంచార్జి రిజిస్ట్రార్ చేతకానితనంలో విశ్వ విద్యాలయం ప్రతిష్ట మంటగలసిపోతోందన్న ఆందోళన యూనివర్శిటీ వర్గాల్లోనే కనిపిస్తోంది.


ఇటీవల జరిగిన రెండు ముఖ్య ఘటనలు ఇంచార్జి రిజిస్ట్రార్ చేతగానితనానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయని యూనివర్శిటీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. కొన్ని రోజుల క్రితం విడుదలైన డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఫలితాలలో తప్పులు దొర్లినట్టు తెలుస్తోంది. ఇంటర్నల్, ఎక్స్ టర్నల్ మార్కులను రెండూ కలిపి ఫలితాలను విడుదల చేయగా పరీక్ష ఫలితాలలో ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు. ఇంటర్నల్ మార్కులు కలపకపోవటంతో తక్కువ మార్కులొచ్చాయని విద్యార్థులు , విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. యూనివర్శిటీ పాలక వర్గాల చేతకానితనానికి హరి అనే ఓ విద్యార్థి ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అధికారులు ఈ ఆరోపణలలో నిజం లేదని చెబుతున్నప్పటికీ నలుగురు ఉద్యోగులకు ఈ విషయంపై మెమోలు జారీ చేశారని తెలుస్తోంది.


మరో ఘటనలో విశ్వవిద్యాలయానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సాంకేతిక సహకారం అందిస్తున్న సంస్థకు చెందిన వ్యక్తిని... అందులోనూ వికలాంగుడిని సాక్షాత్తూ ఇంచార్జ్ రిజిస్ట్రార్ సమక్షంలో దాడి చేయడం, దాదాపు 30 నిమిషాల పాటు నిర్బంధించిన ఘటన యూనివర్శిటీ చరిత్రలోనే చీకటి అధ్యాయంగా చెప్పుకోవచ్చు. తాను వికలాంగుడిని.. నన్ను మరింత భయపెట్టకండి..అని సదరు వ్యక్తి ఎంతగా ప్రాధేయపడుతున్నా సిబ్బంది కరుణించకపోవడం అమానుష ఘటనగా యూనివర్శిటీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

ఈ మొత్తం వ్యవహారాలకు ఇంచార్జి రిజిస్ట్రార్ చేతగానితనం, నిర్లక్ష్యమే కారణంగా యూనివర్శిటీ వర్గాలే బహిరంగంగా మాట్లాడుకుంటున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: