చిత్తూరు జిల్లాలో గ్రామాలకు సమీపంలోనే క్రూరమృగాలు సంచరిస్తుండటం కలకలం రేపుతోంది. తిరుపతి రూరల్ మండలంలో చిరుతపులి సంచారం గ్రామస్థులను హడలెత్తించింది. గుట్టపై చిరుతను చూసిన ఓ మహిళ  పెద్దగా కేకలు వేస్తూ గ్రామానికి చేరుకుంది. ఈ విషయం గ్రామస్థులకు చెప్పటంతో ఎప్పుడు ఏ వైపు నుంచి వచ్చి చిరుత పులి దాడి చేస్తుందోనని గ్రామస్థులు హడలిపోతున్నారు. మరోవైపు గ్రామ యువకులు కర్రలు చేతపట్టి చిరుత పులి గ్రామంలోకి రాకుండా కాపలా కాస్తున్నారు.


చిత్తూరు జిల్లాలో చిరుత పులుల సంచరిస్తున్నాయి. దీంతో జనం తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. తిరుపతి రూరల్ మండలం, పేరూరు పంచాయతీ, పాతకాల్వగుట్ట వద్ద ఓ మహిళకు చిరుత పులి కనిపించింది. గ్రామానికి చెందిన కోమల బట్టలు ఉతికేందుకు అక్కడికి వెళ్ళింది. గుట్టపై ఉన్న చిరుత పులిని చూసి బట్టలు, సెల్ ఫోన్ అక్కడే వదిలేసి భయంతో ఊళ్లోకి పరుగులు తీసింది. గ్రామస్థులు ఈ సమాచారాన్ని పోలీసులు, అటవీశాఖ అధికారులకు చేరవేశారు. యువకులు కర్రలు పట్టుకుని చిరుత పులి సంచరించిన ప్రాంతానికి చేరుకున్నారు. 


చిన్న పిల్లలు, మహిళలు తరచూ గుట్ట వద్ద తిరుగుతుంటారని చిరుతపులి జాడతో ఇప్పుడు భయాందోళన చెందుతున్నారని స్థానిక యువకులు చెబుతున్నారు. పోలీసులు వచ్చి పులి సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు. గుట్టపై తిరగడంతో చిరుత సంచరించిన ఆనవాళ్లు మాత్రం వారు గుర్తించలేకపోయారు. అటవీ శాఖాధికారులు దీనిపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇక...అడపారెడ్డిపల్లి కొండ ప్రాంతం నుంచి తరచూ జింకలు, అడవి పందులు వస్తుంటాయి. అయితే చిరుత పులి రావడం మాత్రం ఇదే మొదటిసారని గ్రామస్థులు చెబుతున్నారు. చిరుత సంచారం వార్త విని గ్రామస్థులు భయంతో హడలిపోతున్నారు. రాత్రిపూట చిరుత గ్రామంలోకి రాకుండా గుంపులుగా కాపలా కాసేందుకు యువకులు సిద్దమయ్యారు.


పాతకాల్వ గ్రామంలో చిరుత పులి ఉన్నట్లు సమాచారం అందడంతో పులి సంచరించిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించామని పోలీసులు తెలిపారు. అటవీశాఖ అధికారులకు కూడా సమాచారం అందించామని చెప్పారు. దీనిపై ఎవరూ ఆందోళన చెందవద్దంటున్నారు స్థానిక పోలీసులు. గ్రామానికి సమీపంలోని గుట్టపై చిరుత సంచరిస్తుండటంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక భయంతో వణికిపోతున్నారు. వీలైనంత త్వరగా చిరుతను అటవీ శాఖాధికారులు పట్టుకోవాలని కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: