అభివృద్ధి కోసమే అప్పులు తెస్తున్నామని స్పష్టం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. బడ్జెట్ పై జరిగిన చర్చకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. మరో పదేళ్లు తానే సీఎంగా ఉంటానని చెప్పారు కేసీఆర్. అంతకుముందు క్వశ్చన్ అవర్లో జ్వరాలపై విపక్షాల ఆందోళనకు.. మంత్రి ఈటల సమాధానమిచ్చారు. 


ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడే అప్పులు చేస్తున్నామని చెప్పారు తెలంగాణ సీఎం కేసీఆర్. ప్రపంచంలో ఆర్థిక శక్తులుగా ఉన్న అమెరికా, చైనా, జపాన్ కు కూడా ఎక్కువ అప్పులు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. అప్పులు చేయడం తప్పు కాదన్న సీఎం.. వాటిని ఎలా ఖర్చు చేస్తున్నామనేదే ముఖ్యమన్నారు. ఎఫ్ఆర్బీఎం పరిమితి 25 శాతం ఉందని, తెలంగాణ రాష్ట్రం 21 శాతమే అప్పులు చేసిందని గుర్తుచేశారు కేసీఆర్. తెలంగాణలో కచ్చితంగా కోటి ఎకరాలకు నీరిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. విపక్షాల సలహాలు స్వీకరించే సంస్కారం ఉందన్న ముఖ్యమంత్రి.. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని విమర్శలు చేయాలని విజ్ఞప్తి చేశారు. 


ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల ఖర్చు మీద కూడా అసెంబ్లీలో చర్చ జరిగింది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కాగా ఖర్చు పెడుతున్నామని, గతంలో ఎప్పుడూ లేని పథకాలకు కూడా రూపకల్పన చేశామని సీఎం కేసీఆర్ చెప్పారు. అయితే అధికారులు సరైన లెక్కలు ఇవ్వడం లేదని, బడ్జెట్ ప్రతిపాదనలకు, ఖర్చుకు సంబంధం ఉండటం లేదని సభ దృష్టికి తెచ్చారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. 


అంతకుముందు ప్రశ్నోత్తరాల్లో జ్వరాల తీవ్రతపై డిస్కషన్ జరిగింది. తెలంగాణలో జ్వరాలు ఎక్కువయ్యాయని, ఖాళీగా ఉన్న డాక్టర్ల పోస్టులు భర్తీ చేయాలని భట్టి కోరగా.. రిక్రూట్ మెంట్ ప్రాసెస్ లో ఉందనీ, అవసరమైనంత మంది టెంపరరీ సిబ్బంది నియామకాలకు ఆదేశాలిచ్చామని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ జవాబిచ్చారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: