ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న నేత మాజీ శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు  తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆయనను హుటాహుటిన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి తరలించగా.. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ తుదిశ్వాసను విడిచారు. కాగా గత కొన్ని రోజులుగా ఆయన్నీ కేసులు చుట్టుముట్టడంతో.. రాజకీయ వేధింపులు తట్టుకోలేక మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు. డాక్టర్ గా ఉన్న ఆయన ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో మళ్లీ అంచెలంచెలుగా ఎదిగిపోయారు.

1947 మే2న కండ్లగుంటలో జన్మించిన ఆయన.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజకీయాల్లో ఎప్పుడూ చురుగ్గా ఉండే ఆయన అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం పట్ల అన్ని రాజకీయ పార్టీ నాయకులు షాక్ కి గురయ్యారు.  తాజాగా  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్,  కోడెల శివప్రసాదరావు మరణం తనను కలచివేసిందన్నారు.   రాజకీయ వేత్తగా అంచెలంచెలుగా ఎదిగి శాసన సభ్యుడిగా మంత్రిగా ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా కోడెల శివప్రసాదరావు ఎన్నో ఉన్నత పదవులు అలంకరించారని చెప్పుకొచ్చారు.

రాజకీయంగా ఎదురవుతున్న ఒడిదుడుకులు తట్టుకోలేక ఆయన తుది శ్వాస విడవటం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. రాజకీయాల్లో ఇలాంటి విమర్శలు, ఆరోపణలు సహజమని..దాన్ని ధైర్యంగా ఎదుర్కొని తమ నిజాయితీ నిరూపించుకుంటే ఎంతో గౌరవం ఉండేది అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు, విమర్శలపై ఆయన రాజకీయంగా పోరాటం జరిపి ఉంటే బాగుండేదన్నారు. 

కోడెల శివప్రసాదరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నట్లు పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.  తన తరపున జనసేన పార్టీ తరపున తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు పవన్ కళ్యాణ్. 


మరింత సమాచారం తెలుసుకోండి: