ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్,  టిడిపి సీనియర్ నాయకుడు కోడెల శివప్రసాదరావు మరణం ఆ పార్టీ శ్రేణులు దిగ్భ్రాంతికి గురి చేసింది.  ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన కోడెల,  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్టీరామారావు,  చంద్రబాబు నాయుడు కేబినెట్లలో  మంత్రిగా పని చేశారు.  రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్ర ప్రదేశ్ తొలి శాసనసభ సభ స్పీకర్ గా వ్యవహరించిన విషయం తెల్సిందే . కోడెల అనగానే నర్సరావుపేట , పరిసర ప్రాంత ప్రజలకు ఠక్కున గుర్తుకు వచ్చేది కోటప్పకొండే.   కోడెల తాను ప్రాతినిధ్యం వహించిన నరసరావుపేట నియోజకవర్గం పరిధిలోని కోటప్పకొండ అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు.


  కోటప్పకొండ పై కొలువై  ఉన్న త్రికోటేశ్వరుడి పై  భక్తి కావచ్చు,  స్థానికులకు త్రికోటేశ్వరుని దర్శించుకునేందుకు పడుతున్న ఇబ్బందులు చూసి కావచ్చు ... కోటప్పకొండ అభివృద్ధిలో మాత్రం ఆయన చూపించిన చొరవ అభినందనీయం.   కోటప్పకొండను  అభివృద్ధి చేయడం ద్వారా  టెంపుల్ టూరిజం తో పాటు, కొండ పై  ఎకో టూరిజం  అభివృద్ధికి కోడెల ఎంతో కృషి చేశారన్నది నిర్వివాదమైన అంశం . గతం లో పోలిస్తే  కోటప్పకొండ పైకి వెళ్ళడానికి చక్కటి రోడ్డు సౌకర్యం కల్పించడం తో పాటు , భక్తులకు మౌలిక వసతుల కల్పన కు కోడెల చేసిన కృషి ని రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తూ ఉంటారు . కోటప్పకొండ ను అభివృద్ధి చేయడం తో , దేవాలయ ఆదాయం కూడా గణనీయంగా పెరిగినట్లు రికార్డులే  చెబుతున్నాయి .


 ప్రతి ఏటా కోటప్పకొండ తిరునాళ్ళు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు . ఈ తిరునాళ్ళకు చుట్టూ పక్కల గ్రామాలకు చెందిన ప్రజలే కాకుండా , పల్నాడు ప్రాంతానికి చెందిన వారు ఎక్కువగా హాజరయి తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు . కోటప్పకొండ అభివృద్ధిలో కీలక భూమిక పోషించిన కోడెల శివప్రసాద్ , అర్ధాంతరంగా తనువు చలించడం పట్ల నరసరావుపేట , పరిసర ప్రాంతాల ప్రజలు సైతం దిగ్ర్భాంతిని వ్యక్తం చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్ధం ఎన్నో సౌకర్యాలు కల్పించడంలో ఒక ప్రజాప్రతినిధిగా ఆయన ఎనలేని కృషి చేశారని కితాబు ఇస్తున్నారు.  .


మరింత సమాచారం తెలుసుకోండి: