చంద్రబాబునాయుడు రాజకీయమే విచిత్రంగా ఉంటుంది. ఎవరిని దూరంగా పెట్టాలన్నా, ఎవరిని దగ్గరకు తీసుకోవాలన్న పెద్ద ప్లానే ఉంటుంది. ఇపుడు కోడెల మరణం విషయంలో చంద్రబాబు చేస్తున్న  రచ్చ కూడా ఇందులో భాగమే.  అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత నుండి బహిరంగంగా కోడెల గురించి చంద్రబాబు ఎక్కడా మాట్లాడలేదు. తాను మాట్లాడకపోతే పోయారు నేతలు కూడా కోడెలకు దూరంగానే ఉండిపోయారు.

 

ఓ వ్యూహం ప్రకారమే చంద్రబాబు అండ్ కో కోడెలను దూరం పెట్టేశారన్నది వాస్తవం. అధికారంలో ఉన్నపుడు కొడుకు శివరామ్, కూతురు విజయలక్ష్మి నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో సాగించిన అరాచకాలతో జిల్లాలో టిడిపికి బాగా చెడ్డ పేరొచ్చేసింది.  అదే సమయంలో ఎన్నికల్లో కోడెలకు టిక్కెట్టే చివరి నిముషంలో దక్కటం అందరికీ గుర్తుండే ఉంటుంది.

 

సరే అధికారంలో ఉన్నపుడు  రేగిన గబ్బంతా ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత తమకు ఎక్కడ అంటుకుంటుందో అన్న ఉద్దేశ్యంతో  కోడెల కుటుంబాన్ని చంద్రబాబు దూరంగా పెట్టేశారు. అందుకనే కోడెలపై వైసిపి నేతలు ఎంతలా ఆరోపణలు చేస్తున్నా కోడెలకు మద్దతుగా చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

 

దానికితోడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కొడుకు, కూతురుపై చెరో 25 కేసులు నమోదయ్యాయి.  అప్పుడు కూడా టిడిపి నుండి ఎవరూ కోడెలకు మద్దతుగా నిలబడలేదు. చివరకు అసెంబ్లీ ఫర్నీచర్ దొంగతనం కేసులో కోడెల స్వయంగా దొరికిపోయినపుడు కూడా చంద్రబాబు మద్దతుగా నిలవలేదు. అదే సమయంలో వర్ల రామయ్య లాంటి సీనియర్లతో కోడెల చేసింది తప్పేనంటూ ప్రకటనలిప్పించారు.

 

గడచిన మూడు నెలలుగా తనతో పాటు కుటుంబంపై పడిన కేసులతో కోడెలేమీ కుంగిపోలేదు. అధికారంలో ఉన్నపుడు చేసిన తప్పుడు పనులకు, అరాచకాలకు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మూల్యం చెల్లించుకోక తప్పదని తెలియనంత అమాయకుడేమీ కాదు కోడెల. కాకపోతే కోడెల మానసికంగా ఇబ్బందులు పడింది చంద్రబాబు చేష్టలవల్లే అన్నది స్పష్టగా తెలుస్తోంది. ఆ నెపం తనపై ఎక్కడ పడుతుందో అన్న భయంతోనే కోడెల విషయంలో చంద్రబాబు ఇపుడు ఇంత రచ్చ చేస్తున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: