ఆనాడు తెలంగాణ రైతాంగం భూస్వాములూ, జమీందార్ల దోపిడీ నుంచి విముక్తి కోరుకున్నారు. జమీందార్ల అణచివేత నుంచి విమోచన కోసం పోరాడారు.నిజాం రాజ్యం భారతదేశంలో విలీనం కావటంతో తెలంగాణ ప్రజలకు విముక్తి లభించినట్టయ్యింది. దీనితో నిజాం రాచరికం పునాదులను కదిలించారనే చెప్పాలి. హైదరాబాద్‌ రాజ్యం, అందులో భాగంగా తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమైన రోజు అది. అదొక చారిత్రక ఘట్టం. తద్వారా రాచరికం అంతమై ప్రజాస్వామ్య రాజ్యాంగ పరిధిలోకి తెలంగాణ కూడా వచ్చింది. ఆమేరకు ప్రజల విజయం. జమ్మూ కాశ్మీర్‌లో మెజారిటీ ప్రజలు ముస్లింలు. కానీ ఆనాటి రాజు హిందువైన హరిసింగ్‌. ఆ రాచరికం వద్దనీ, ప్రజాస్వామ్యమే కావాలనీ, భూస్వామ్య విధానం రద్దు చేసి భూమి పంచాలన్న కాశ్మీర్‌ ప్రజా ఉద్యమం వీరికి గిట్టలేదు. అందుకే ఆనాడు జమ్మూ కాశ్మీర్‌ రాచరికమే వీరికి బాగా నచ్చింది. ఇక్కడ హైదరాబాద్‌ రాజ్యంలో మెజారిటీ ప్రజలు హిందువులు. పాలకులు మాత్రం ముస్లిం రాజు. అందువల్ల వీరికి నిజాం రాజు పాలన ఇష్టంలేదు. కానీ తెలంగాణ రైతాంగం జమీందార్ల దోపిడీకి వ్యతిరేకంగా తిరగబడ్డారు. జమీందార్ల రక్షకుడుగా నిజాం పాలకులు ప్రజల మీద విరుచుకుపడ్డారు. అందుకే నిజాం పాలనకూ, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా  సాయుధ రైతాంగ పోరాటం సాగింది.



తెలంగాణ రైతాంగం గానీ, జమ్మూ కాశ్మీర్‌ ప్రజలు గానీ ఆనాడు మతపరమైన ధోరణి ప్రదర్శించలేదు. కాశ్మీర్‌ ప్రజలు షేక్‌ అబ్దుల్లా నాయకత్వంలో భూమికోసం, ప్రజాస్వామ్యం కోసం తిరగబడ్డారు. తెలంగాణ రైతాంగం హిందూ జమీందార్ల దోపిడీని ప్రతిఘటించారు. భూస్వామ్య, పెత్తందారీ దౌర్జన్యాలపైన తిరగబడ్డారు. భూస్వాములనూ జమీందార్లను రక్షించేందుకు నిజాం బలగాలను, రజాకార్లను రంగంలోకి దించారు. హిందూ జమీందార్ల దోపిడీకి అండగా, పెత్తందార్లకు రక్షణగా నిజాం రాజు రంగంలోకి దిగాడు. భూస్వామ్య దోపిడీకీ, నిజాం నిరంకుశ పాలనకూ వ్యతిరేకంగా రగిలిన హిందూ, ముస్లిం సాధారణ ప్రజల సమైక్య పోరాటమే తెలంగాణ నుదుట నెత్తుటి తిలకమైంది. నిజాం రాజును రాజ ప్రముఖ్‌గా తెలంగాణ మీద బలవంతంగా రుద్దిన వారు హిందువులైన జవహర్‌లాల్‌ నెహ్రూ, సర్దార్‌ వల్లభారుపటేల్‌! ఇక్కడ కూడా మతం సమస్యే కాదు. శ్రామికులకు వ్యతిరేకంగా దొరల ప్రయోజనాల పరిరక్షలుగానే వీరంతా చేతులు కలిపారు.





బాంచెనన్న బతుకులే బందూకులు పట్టిన పోరాటమది. మహిళలు బందూకులై సత్తా చూపిన మహత్తర సమరం అది. ఒక బందగీ.. ఒక కొమరయ్య.. ఒక షోయబుల్లాఖాన్‌.. ఒక దాశరథి.. ఒక అయిలమ్మ.. ఒక సుద్దాల హనుమంతు.. ఎందరెందరో కులం, మతం విడిచి, కలం, 'ఖడ్గం' పట్టి తిరగబడ్డారు. మట్టి నుంచి పుట్టిన మాణిక్యాలై.. గుండుకెదురు గుండె నిలిపిన యోధులయ్యారు. ఇలాంటి మహత్తర పోరాట చరిత్రను వక్రీకరించేందుకు కొన్ని శక్తులు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న నిజాం పాలనను తుదముట్టించేందుకే వస్తున్నామని చెప్పి సైన్యాన్ని పంపిన నెహ్రూ, పటేల్‌ నాయకత్వం.. ఆ నిజాం ప్రభువుతోనే కుమ్మక్కయ్యింది. రాచరికం మీద యుద్ధానికే నెహ్రూ పటేల్‌ సైన్యాలు వస్తున్నాయని నమ్మి స్వాగతం పలికిన రైతాంగం మీదనే తమ తుపాకులు గురిపెట్టారు.





చరిత్రను నిస్పాక్షికంగా పరిశీలించే వారెవరికైనా అర్థమయ్యే మరొక మహత్తర జ్ఞాపకం ఉన్నది. అదే జులై 4, తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. అదే దొడ్డి కొమురయ్య రక్తతర్పణ చేసిన రోజు. సాయుధ తిరుగుబాటుకు శ్రీకారం చుట్టిన రోజు. అందుకే ఆ జ్ఞాపకం కార్మికవర్గానికీ, శ్రామిక జనానికీ స్ఫూర్తినిస్తుంది. చరిత్ర మిగిల్చిన కర్తవ్య సాధనకు కంకణ బద్ధులయ్యే రోజు. టీఆర్‌ఎస్‌ నాయకత్వం కూడా తెలంగాణ సాయుధ పోరాట యోధులు అయిలమ్మ, కొమురయ్యల పేర్లు స్వార్థ, సంకుచిత ప్రయోజనాల కోసం వాడుకున్నదే తప్ప, ఆ చరిత్ర స్ఫూర్తిని అందించడానికి సిద్ధంగా లేదు. చివరిగా ఒక్కమాట.. బ్రిటిష్‌ పాలకుల నుంచి రాజకీయ స్వాతంత్య్రం సాధించుకున్నామే  తప్ప.. శ్రమ దోపిడీ నుంచి విముక్తి కాలేదు కదా.. ఇది నిజం. దేశానికి తెల్లదొరల నుంచి స్వాతంత్య్రం లభించింది. ఇదీ నిజం. నాటి ప్రజా పోరాటాల చరిత్రకు దూరంగా ఉన్నవారు.. ఆ చరిత్రను వక్రీకరిస్తూ, నేడు అధికార దాహంతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: