సెప్టెంబ‌ర్ నెల వ‌స్తుందంటే....తెలంగాణ రాష్ట్రంలో ఏర్ప‌డే రాజ‌కీయ వేడి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయ‌న‌వ‌స‌రం లేదు. విలీనం, విమోచ‌నం, విద్రోహ దినం పేరుతో..ఆయా పార్టీల‌న్నీ త‌మ‌దైన శైలిలో రాజ‌కీయాలు చేస్తుంటాయి. అయితే, ఈ సెప్టెంబ‌ర్ 17 సంద‌ర్భంగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండాను  తెలంగాణ భవన్‌లో ఎగురవేశారు. మ‌రోవైపు బీజేపీ రాష్ట్ర కార్యాల‌యంలోనూ వివిధ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు.


కాగా, సెప్టెంబ‌ర్ 17 సందర్భంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. భారత యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనం అయిన నేడు.. ఆనాటి పోరాటంలో అసమాన త్యాగాలు చేసిన వీరులను స్మరించుకుందాం.. జై తెలంగాణ, జై హింద్ అని ట్వీట్ చేశారు కేటీఆర్. తెలంగాణ భవన్‌లో జాతీయ జెండా ఎగురవేసిన కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు నాయిని నర్సింహారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.


ఇదిలాఉండ‌గా....సెప్టెంబర్​ 17వ తేదీపై  తెలంగాణలో దాదాపు 70 ఏళ్లుగా వివాదం నలుగుతోంది . నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించిన రోజు కాబట్టి ‘విమోచన దినోత్సవం’ జరపాలంటారు కొందరు. హైదరాబాద్​ సంస్థానాన్ని ఇండియన్​ యూనియన్​లో కలిపేసిన రోజు కాబట్టి ‘విలీన దినోత్సవం’ జరపాలంటారు మరికొందరు. దేశానికి 1947 ఆగస్టు 15న ఇండిపెండెన్స్​ లభించగా, హైదరాబాద్​ సంస్థానానికి ఏడాది తర్వాత విముక్తి లభించిందన్న చారిత్రక వాస్తవంపై ఎలాంటి గొడవా లేదు. హైదరాబాద్ సంస్థానంలో జాతీయోద్యమ నిర్మాణం పత్రికలు, సాహిత్యం, కళారూపాల్లో కూడా సాగింది. ఆంధ్రోద్యమం, గ్రంథాలయోద్యమం, ఆంధ్ర మహాసభ నిర్వహణోద్యమం, స్టేట్ కాంగ్రెస్ ఉద్యమం, ఆర్యసమాజ ఉద్యమం, విద్యార్థుల వందేమాతర ఉద్యమం, కమ్యూనిస్టులు, సోషలిస్టుల ఉద్యమం, హిందూ మహాసభ ఉద్యమం వేర్వేరుగా సాగినా… అన్నిటి లక్ష్యం ఒక్కటే, నిజాం చెరనుంచి విమోచన పొందడం. ఈ విముక్తి పోరాటంలో పాల్గొన్న ప్రజలు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల కార్యకర్తలను స్మరించుకోవడం తప్పనిసరి. ఏదైనా కానీ తెలంగాణ గడ్డకు స్వేచ్ఛ వచ్చిన రోజు ఇది.



మరింత సమాచారం తెలుసుకోండి: