టీఆర్ఎస్ పార్టీ యువ‌నేత‌, తెలంగాణ‌ ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఐటీ, ఆవిష్క‌ర‌ణ‌ల్లో త‌న ముద్ర వేసుకున్న తెలంగాణ గురించి మ‌రో ముఖ్య‌మైన అంశం వెల్ల‌డించారు. టీహబ్-1 విజయాలు, టీహబ్-2 ఏర్పాటు తదితర అంశాలపై శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం 2015 నవంబర్‌లో ప్రారంభించిన టెక్నాలజీ ఇంక్యుబేటర్ టీహబ్-1 గణనీయ విజయాన్ని సాధించిందని ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. టీహబ్ విజయాల స్ఫూర్తితో ఏర్పాటుచేస్తున్న టీహబ్-2ను వచ్చే ఏడాది మార్చినాటికి అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. 


వినూత్న ఆలోచనలతో రండి.. విజయాలతో వెళ్లండి అనే నినాదంతో టీహబ్-2ను ఏర్పాటుచేస్తున్నామని, వెయ్యికిపైగా అంకుర పరిశ్రమలకు (స్టార్టప్స్‌కు) అవకాశం కల్పించేందుకు వీలుండే టీహబ్-2 ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ అవుతుందని చెప్పారు. రాయదుర్గం ప్రాంతంలో మూడెకరాల స్థలంలో రూ.276.22 కోట్ల వ్యయంతో 4 వేలమందికి ఉపయోగపడేలా 3,50,000 చదరపు అడుగుల్లో టీహబ్-2ను ఏర్పాటుచేస్తున్నట్టు మంత్రి కేటీఆర్ వివరించారు. టీహబ్-1లోని మొత్తం 500 స్టార్టప్స్‌లో రెండువేల మందికిపైగా యువతకు ఉపాధి కల్పించామన్నారు. కొత్త ఆవిష్కరణల్లో యువత అపజయం సాధించినప్పటికీ వారు నిరుత్సాహపడకుండా ఉండేందుకు ఎంట్రపెన్యూర్ అండ్ రెసిడెన్స్ పేరిట టీహబ్ ద్వారా సర్టిఫికెట్లు ఇస్తున్నట్టు తెలిపారు. 


తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు హైదరాబాద్‌లో కేవలం రెండు ఇంక్యుబేటర్ సెంటర్లు ఉంటే.. టీహబ్-1 ఏర్పాటుతో 55 ఇంక్యుబేషన్ సెంటర్లు వచ్చాయని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ కాబోతున్న టీహబ్-2తో యువతకు విస్తృత అవకాశాలు లభిస్తాయని, పెద్దఎత్తున నూతన ఆవిష్కరణలకు అవకాశం ఉంటుందని చెప్పారు. గోవా, ఢిల్లీ, అసోం లాంటి రాష్ర్టాలు తమ ప్రాంతాల్లో ఇంక్యుబేటర్ సెంటర్ల ఏర్పాటుకు తెలంగాణను సాంకేతిక భాగస్వామిగా చేసుకున్నాయన్నారు. గూగుల్, ఫేస్‌బుక్ లాంటి అనేక అంతర్జాతీయ కంపెనీలతోపాటు బీడీఎల్ లాంటి ప్రభుత్వరంగ సంస్థలు కూడా టీహబ్‌లో అనేక ఆవిష్కరణలు చేస్తున్నాయని, మైక్రోసాఫ్ట్ సంస్థ సీఈవో సత్య నాదెళ్ల లాంటి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ కంపెనీల సీఈవోలు, వివిధ దేశాలు, 11 రాష్ర్టాల ప్రతినిధి బృందాలు టీహబ్‌ను సందర్శించినట్టు తెలిపారు. 


దేశవ్యాప్తంగా ఆవిష్కరణలను పెంచేందుకు తెలంగాణ స్టార్టప్ పాలసీని ఆదర్శంగా తీసుకోవాలని నీతి ఆయోగ్‌తోపాటు రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నియమించిన కమిటీ సూచించిన విషయాన్ని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. గ్రామీణ యువత కోసం తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్‌ను ఏర్పాటుచేసి.. రెడ్‌బస్ సంస్థను స్థాపించిన నిజామాబాద్‌వాసి సామ ఫణీంద్రను సీఈవోగా నియమించామని, అదేవిధంగా హైదరాబాద్‌లోని సీసీఎంబీ, ఎన్‌ఐఎన్ లాంటి ప్రముఖ సంస్థల పరిశోధనలు సమాజానికి ఉపయోగపడేలా రిడ్జ్ పేరిట మరో సంస్థను ఏర్పాటుచేశామని తెలిపారు. హార్డ్‌వేర్ రంగంలో వస్తున్న మార్పుల దిశగా యువతను ప్రోత్సహించేందుకు త్వరలో టీ-వర్క్స్ సంస్థను ప్రారంభించబోతున్నామని, హైదరాబాద్‌తోపాటు ద్వితీయశ్రేణి నగరాల్లోనూ ఐటీ పరిశ్రమను విస్తరించేందుకు చర్యలు తీసుకొంటున్నమని చెప్పారు. కరీంనగర్‌లో రూ.33.5 కోట్లతో ఏర్పాటుచేసిన ఐటీ హబ్‌ను వచ్చేనెలలోనే ప్రారంభించబోతున్నామని, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్‌లో ఐటీ హబ్‌ల ఏర్పాటు పనులు వివిధ దశల్లో ఉన్నాయని మంత్రి కేటీఆర్ వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: