మాజీమంత్రి, టీడీపీ నాయ‌కుడు చ‌దిపిరాళ్ల ఆదినారాయ‌ణ రెడ్డి ఫ్యూచ‌ర్ ఏంటి ? ఆయ‌న ఎటు న‌డ‌వాల‌ని అనుకున్నారు?  ఆయ‌న రాజ‌కీయ ప్ర‌స్థానం ఏదిశ‌గా సాగ‌నుంది? ఇప్పుడు రాజ‌కీయ మేధావుల‌ను తొలిచేస్తు న్న ప్ర‌ధాన ప్ర‌శ్న ఇది. ఎటు చూసినా.. ఆయ‌న పార్టీ మార‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. క‌డ‌ప జిల్లాకు చెందిన ఆది నారాయ‌ణ రెడ్డి.. జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై ప‌లుమార్లు విజ‌యం సాధించారు. త‌ర్వాత ఆయ‌న రాష్ట్ర విభ‌జ‌న‌తో వైసీపీ గూటికి చేరారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడిగా మారారు.


2014లో వైసీపీ టికెట్‌పై జ‌మ్మ‌ల‌మ‌డుగు నుంచి విజ‌యం సాధించారు. అనంత‌ర కాలంలో  టీడీపీ అధినేత‌, అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు చేప‌ట్టిన ఆక‌ర్ష్ మంత్రానికి వ‌సుడైన ఆది.. టీడీపీ తీర్తం పుచ్చుకున్నారు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు ఆయ‌న‌కు మంత్రిగా బెర్త్ కూడా కేటాయించారు. ఇక, నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీతో వైరి ప‌క్షంగా ఉన్న‌ప్ప‌టికీ.. సుబ్బారెడ్డితో స‌ఖ్య‌త పెంచుకుని ముందుకు సాగారు. ఇద్ద‌రూ క‌లిసి క‌డ‌ప ఎంపీగాఆది, జ‌మ్మ‌ల‌మ‌డుగు అసెంబ్లీకి సుబ్బారెడ్డి పోటీ చేశారు. కానీ, జ‌గ‌న్ జ‌న సునామీ ముందు ఇద్ద‌రూ ఘోరంగా ఓడిపోయారు.


దీంతో ఆది గ‌డిచిన మూడు మాసాలుగా పార్టీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేదు. ఇప్ప‌టికే ఆయ‌న‌పై న‌మోదైన కేసుల‌ను మ‌రోసారి తెర‌మీదికి తెచ్చేందుకు పోలీసులు వ్యూహాత్మ‌కంగా ముందుకు క‌దులు తున్నారు. దీంతో తాను టీడీపీలో ఉంటే ప‌రిస్థితి మ‌రింత దారుణంగా మారుతుంద‌ని గ్ర‌హించిన ఆది.. బీజేపీలోకి వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీనికి సంబంధించి ఏకంగా ఆయ‌న బీజేపీ పెద్ద‌ల‌తోనూ హైద‌రాబాద్‌లో భేటీ అయ్యారు. త్వ‌ర‌లోనే ఆయ‌న బీజేపీలో చేర‌తార‌ని రెండు నెల‌లుగా వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు.


నాలుగు రోజుల కింద‌ట కూడా ఆయ‌న టీడీపీ అధినేత చంద్ర‌బాబును క‌లిసి తాను పార్టీ మారుతున్న విష‌యాన్ని చెప్ప‌డం, ఆయ‌న కూడా ప‌చ్చ‌జెండా ఊప‌డం జ‌రిగిపోయాయి. ఇక‌, తెల్ల‌వారే ఆయ‌న ఢిల్లీలో బీజేపీ కండువా క‌ప్పుకొంటార‌ని ప్ర‌చారం కూడా జ‌రిగింది. అయితే, ఇంత‌లోనే ఏమైందో ఏమో ఆది అప్ప‌టి నుంచి మీడియాకు ముఖం చాటేస్తున్నారు. ఆయ‌న బీజేపీలోకి వెళ్లేది ఖాయ‌మే అయిన‌ప్ప‌టికీ.. ఇంకా టైం ప‌డుతుంద‌ని అంటున్నారు. భారీ జ‌న‌సందోహంతో ఆయ‌న బీజేపీలో చేరి కీల‌క మైన ప‌ద‌వి దేనినైనా అందిపుచ్చుకుంటార‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: