తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు గ్రామం దగ్గర మునిగిపోయింది. ఈనెల 15న మధ్యాహ్నం బోటు మునిగి ఎందరో ప్రాణాలు పోయిన విషయం తెలిసిందే. అయితే ప్రమాదం జరిగే సరికి పర్యటకులు, 8 మంది సిబ్బందీ కలిపి మొత్తం బోటులో 73 మంది ఉంటారని అధికారులు అంచనా వేశారు. ప్రయాణికుల సంఖ్యలో కొంత మార్పు ఉండవచ్చని అధికారులు చెబుతూ వస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన తక్కువ సమయంలోనే ప్రమాద స్థలానికి ముందుగా చేరుకున్న స్థానికులు చాలా మంది పర్యటకులను రక్షించారు

ప్రమాదంలో మొత్తం 24 మంది మగవారూ, ఇద్దరు ఆడవారూ కలిపి 26 మంది క్షేమంగా బయటపడ్డారు. వారిలో కొందరికి గాయాలు అయ్యాయి. నిన్నటి వరకు 34 మృతదేహాలు దొరికాయి. వాటిలో 23 మగవారివి కాగా, 8 ఆడవారివి, 3 పిల్లలవి ఉన్నాయి. ఇంకా 13 మంది ఆచూకీ లభించాల్సి ఉంది. మృతదేహాల పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించారు.

 

కొనసాగుతున్న సహాయక చర్యలు

సహాయక చర్యలో భాగంగా ఆరు అగ్నిమాపక శాఖ బృందాలు, రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 3 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, నేవీకి చెందిన ఒక డీప్ డైవర్స్ బృందం, ఉత్తరాఖండ్ ఎస్డీఆర్ఎఫ్‌కు చెందిన ఒక బృందం, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అనేక శాఖలూ, విభాగాలూ, సంస్థలూ పాల్గొన్నాయి. రెవెన్యూ, పోలీస్, ఐటీడీఏ అధికారులు ఈ సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అయిత ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం పాపికొండలు ప్రాంతంలో బోట్లు తిరగడాన్ని రద్దు చేసింది. ముఖ్యమంత్రి జగన్ అన్ని శాఖలతో సమీక్ష జరిపి గతంలో ఇచ్చిన జీవోల అమలూ, కొత్తగా తేవాల్సిన నిబంధనల గురించి ఆదేశాలు జారీ చేశారు.

 

సైడ్ స్కాన్ సోనార్ మెషీన్ ద్వారా బోటు జాడ గుర్తింపు

బుధవారం ఉత్తరాఖండ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది తమ దగ్గర ఉన్న సైడ్ స్కాన్ సోనార్ మెషీన్ ద్వారా బోటు జాడ గుర్తించారు. కచ్చులూరు దగ్గర్లో ప్రమాదం జరిగిన చోట 210 అడుగుల లోతులో బోటు ఉందని చెప్పారు. మంగళవారం సాయంత్రం వరకూ కాస్త అనుమానం ఉన్నప్పటికీ, బుధవారం నాటికి బోటు ఉన్న ప్రదేశంపై స్పష్టత వచ్చింది.

 

ప్రస్తుతం అధికారులు బోటు వెలికితీసే ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకోసం కొన్ని ప్రైవేటు సంస్థల సహకారం కూడా తీసుకుంటున్నారు. కాకినాడ, ముంబైలకు చెందిన నిపుణులు, ప్రైవేటు సంస్థల వారినీ రప్పించారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులూ, నిపుణులూ కలసి ఏ విధంగా బోటును బయటకు తీయాలి అనే విషయమై చర్చించారు.

 

అయితే నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం, ప్రమాదం జరిగిన చోట గోదావరి నది సన్నగా ఉండి లోతు ఎక్కువగా ఉండడం, దాదాపు 210 అడుగుల లోతున విపరీతమైన ఒత్తిడి ఉండడం, ఆ ప్రాంతంలో సుడులు తిరుగుతూ ప్రవహిస్తూండడం.. ఇవన్నీ కలసి బోటు తీసే ప్రక్రియను ఆలస్యం చేస్తున్నాయి.

 

బోటును బయటకు ఎలా తీస్తారు?

సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో నిపుణులైన ఈతగాళ్లు నీటి అడుగుకు వెళ్లి ఆ పడవకు తాళ్లు కడతారు. అప్పుడు ఒడ్డు నుంచి తాళ్లను లాగి బోటును బయటకు తీసుకువస్తే ఏర్పాట్లు చేస్తారు. నీటిలో దిగడం వీలుకానప్పుడు ఏదైనా బరువైన వస్తువులను లేదా యాంకర్లను కట్టిన తాళ్లను ఆ ప్రాంతానికి విసురుతారు. అవి బోటుకు ఏదో ఒక భాగంలో అతుక్కుంటాయి. అప్పుడు పైకి లాగుతారు. కానీ నీరు కదలకుండా ఉంటేనే ఇది సులువయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నమాట. లేకపోతే నీటి వేగానికి విసిరిన తాళ్లు పక్కకు వెళ్లిపోతాయి. పై నుంచి బోటులో కదలకుండా ఉండి ఈ పనంతా చేయడం కూడా కష్టమేనని చెబుతున్నారు. కానీ ఇక్కడ లోతు, నీటి వేగం, ఒత్తిడి వల్ల ఆ రెండు పద్ధతులూ సాధ్య పడడం లేదు.

 

ఇక అధికారులు పరిశీలిస్తున్న మూడో మార్గం చాలా పొడవైన అంటే దాదాపు బోటు ఉన్న చోటుకు ఐదారు రెట్లు పొడవైన (సుమారు వెయ్యి అడుగులు) బలమైన తాళ్లను తెప్పించి బోటు ఉన్న ప్రాంతం చుట్టూ నీటిలోకి వేస్తారు. ఆ తాడు కిందకు వెళ్లి బోటును చుట్టుకునేలా వేస్తారు. అప్పుడు దాన్ని పైకి లాగుతారు. ఈ ప్రక్రియపై ఈ రోజు నిర్ణయం తీసుకుని ప్రయత్నంలో ఉన్నారు అధికారులు

 

ఇది తీవ్ర సమస్యగా ఉంది: డీఐజీ

"ఫ్లోర్ మ్యాపింగ్ సరిగ్గా తేలితే ఏ విధంగా చేయవచ్చనేది తెలుస్తుందని ఏలూరు డీఐజీ ఏఎస్ ఖాన్ అంటున్నారు. కింత ఒత్తిడి, చీకటిగా ఉందంటున్నారు. సరైన ఫొటోలు రావడం లేదు. దీంతో ఇది తీవ్ర సమస్యగా ఉంది" అని వివరించారు. కాగా, బోటు యజమానిపై పోలీసులు ఐపీసీ 304 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం మేజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: