ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ -2 కథ ముగిసినట్టేనా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది కొందరి నిపుణుల నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగం గురించి ఆశలు వదులుకోవాల్సిందేనని తెలుస్తోంది. 3,84,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి.. చంద్రుడికి అత్యంత సమీపకక్ష్యలోకి విజయవంతంగా చేరిన ల్యాండర్‌ విక్రమ్‌‌తో సాంకేతిక సంబంధాలు తెగిపోవడంతో శాస్త్రవేత్తలతో పాటు, యావత్ భారత్ మొత్తం తీవ్ర టెన్షన్ కు గురైన విషయం తెలిసిందే. విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించి ఫొటోలు తీయడంలో తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేసిన చివరి ప్రయత్నం కూడా విఫలమైనట్లు కనిపిస్తోంది. నాసా ఆర్బిటర్ తీసిన చిత్రాల్లో కూడా విక్రమ్ ల్యాండర్ ఆనవాళ్లు కనిపించలేదు.

 

నాసా చేసిన చివరి ప్రయత్నం కూడా ఫలించకపోవడంతో కావడంతో ఇస్రో విక్రమ్ ల్యాండర్‌పై ఆశలు వదిలేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, చంద్రయాన్-2కు ప్రయోగం గురించి ఇస్రో ఓ భావోద్వేగ ట్వీట్ చేసింది.  తమకు అండగా నిలిచిన వారందరికీ ఇస్రో ధన్యవాదాలు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల ఆశలను, ఆకాంక్షలను సాధించే దిశగా ప్రయత్నిస్తూనే ఉంటామని ఇస్రో ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌ కోట్ల మంది భారతీయుల హృదయాలను గెలుచుకుంది. భారత శాస్త్ర సాంకేతిక రంగానికి ఇస్రో చేసిన సేవలను నెటిజన్లు అభినందించారు. ఎప్పటికీ మీ వెంటే ఉంటామని ఇస్రోకు మద్దతుగా పోస్ట్‌లు పెడుతున్నారు.

 

 

కనిపించని విక్రమ్ జాడ

లూనార్ రెకొనసెన్స్ ఆర్బిటర్ కెమెరా (LROC) ద్వారా సెప్టెంబర్ 17న తీసిన చిత్రాలను పోల్చి చూసిన LROC టీమ్.. అందులో విక్రమ్ జాడ కనిపించలేదని తెలిపింది. లూనార్ రెకొనసెన్స్ ఆర్బిటార్ కెమెరా విక్రమ్ ల్యాండర్‌ను ఫొటోలను తీయలేకపోయిందని వెల్లడించింది. ప్రస్తుతం విక్రమ్ దిగిన ప్రాంతంలో వాతావరణం దుమ్ము, ధూళితో ఉందని.. విక్రమ్‌ను ఫొటో తీయలేకపోవడానికి అది కూడా ఒక కారణం అయి ఉంటుందని నాసా వ్యోమగామి ఒకరు వెల్లడించారు. సెప్టెంబరు 17, అంతకుముందు తీసిన చిత్రాలను విశ్లేషిస్తున్నామని.. త్వరలోనే వాటిని విడుదల చేస్తామని స్పష్టంచేశారు.

 

అయితే విక్రమ్ తో సంబంధాలు తెగిపోయిన నాటి నుంచి విక్రమ్‌తో కమ్యూనికేషన్‌ను పునరుద్ధరించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. విక్రమ్‌తో ఇస్రో కమ్యూనికేషన్ కోల్పోయి 12 రోజులవుతోంది. మరో రెండు రోజులు గడిస్తే విక్రమ్‌ ల్యాండర్‌తో పాటు ప్రజ్ఞాన్ రోవర్‌ని మర్చిపోవాల్సిందే నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చంద్రుడిపై విక్రమ్, ప్రజ్ఞాన్ పనిచేసేది 14 రోజులే. ఇక మిగిలింది రెండు రోజులే ఉండడంతో విక్రమ్‌ నుంచి సిగ్నల్ వచ్చేందుకు అవకాశం తక్కువగా ఉందని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా చంద్రయాన్-2 ప్రయోగం విఫలమయినట్లుగా మనం భావించకూడదు. చంద్రుడి దక్షిణ ధృవంపైకి ఇంతకు వరకు ఏ దేశమూ వెళ్లలేదు. కానీ అలాంటి ప్రాంతానికి ఇస్రో తొలిసారిగా విక్రమ్‌ను పంపి చరిత్ర సృష్టించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: