సురక్షిత భారత్ కోసం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దీంతో దేశంలో ప్లాస్టిక్ పై యుద్ధం మొదలయింది. విచ్చలవిడిగా పెరిగిపోతున్న ప్లాస్టిక్ వినియోగంతో పర్యావరణం కలుషితమవుతోంది. ఎన్నో మూగ జీవాలు కూడా ప్లాస్టిక్ కవర్లను తిని మృతి చెందుతున్నాయి. ప్లాస్టిక్ వినియోగం తగ్గించాల్సిన అవశ్యకత కూడా ఏర్పడింది. పశ్చిమ బెంగాల్ లోని ఓ ఫారెస్ట్ ఆఫీసర్ ఇందులో ముందడుగు వేశాడు. వ్యర్ధంగా పడి ఉన్న ప్లాస్టిక్ ను ఉపయోగించి పర్యావరణం పెంచుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.



పశ్చిమ బెంగాల్‌కు చెందిన పాపన్ మొహంతా ఓ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. మిడ్నాపూర్ తాలూకా పిరకాటా ఫారెస్ట్‌ రేంజ్‌ లో ఈ ఆఫీసర్ నాలుగేళ్ల క్రితం విధుల్లో చేరాడు. అప్పటి నుండి సమీప పరిసరాల్లో విపరీతంగా ప్లాస్టిక్‌ వ్యర్ధాలుండటం గమనించాడు. దీంతో.. వాటిని ఉపయోగించి ఉపయోగపడే పని చేయాలనే తలంపుతో ఓ వినూత్న ప్రయోగం చేశారు. అక్కడి ప్లాస్టిక్ వ్యర్ధాలను సేకరించి వాటిలో మట్టి నింపి అందమైన పూల మొక్కలను నాటాడు. వాటంన్నింటినీ తన కార్యాలయం చుట్టూ హ్యాంగింగ్ గార్డెన్ లా ఏర్పాటు చేశాడు. దాదాపు 1100 ప్లాస్టీక్ బాటిళ్లు, పాత టైర్లను ఇందుకు వినియోగించి ఓ పూల తోటనే సృష్టించాడు. నాలుగేళ్లుగా చేస్తున్న ఈపనితో ఆ ప్రాంతమంతా పూలవనంలా తయారయింది. దీంతో ఆ అటవీ కార్యాలయం చూపరులను ఆకట్టుకుంటోంది. అటవీ అధికారి చేసిన ఈ ప్రయత్నాన్ని అక్కడ చాలామంది ఆచరణలో పెట్టారు. ఆ ప్రాంతంలోని ఓ పాఠశాలలో ఇదే విధంగా మొక్కలు పెంచుతూ పర్యావరణంపై విద్యార్ధులకు అవగాహన పెంచుతున్నారు ఉపాధ్యాయులు.  ఉన్నతాధికారులు కూడా పాపన్ చేసిన పనిని మెచ్చుకుంటున్నారు.



 'డ్యూటీ పూర్తవగానే ఇలా మొక్కలు పెంచడమే నా వ్యాపకం. సీజనల్ పూల మొక్కలు కూడా నావద్ద ఉన్నాయి. ప్లాస్టిక్ ను తరిమికొట్టి భావితరాల కోసం పర్యావరణాన్ని పెంపొందించాలి. ఈ పద్ధతి గురించి బాగా ప్రచారం జరగాలి. అందరూ పర్యావరణం పెంచేందుకు తమ వంతు ప్రయత్నం చేయాలి ' అంటున్నాడు పాపన్. ప్లాస్టిక్ బాటిల్స్ ను, టైర్లను తగులబెట్టి కాలుష్యాన్ని కలుషితం చేయకుండా ఈ అటవీ అధికారి చేసిన ప్రయత్నాన్ని అభినందించాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: