రాను రాను తిరుమల తిరుపతి దేవస్ధానం ట్రస్టు బోర్డు రాజకీయాలతో కంపు కొడుతోంది. రెండు రోజుల క్రితమే జంబో జట్టును తలపించేట్లుగా 28 మందితో పూర్తిస్ధాయి బోర్డును నియమించిన ప్రభుత్వం తాజాగా మరో ఏడుగురిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయటమే విచిత్రంగా ఉంది. అంటే తాజా ఉత్తర్వుల ప్రకారం టిటిడి ట్రస్టుబోర్డులో మొత్తం సభ్యుల సంఖ్య 35కి చేరుకుంది. ఇది ఇంతటితో ఆగుతుందా లేకపోతే మరికొందరు నియమితులవుతారో తెలీదు.

 

చంద్రబాబునాయుడుతో సహా  ఎవరు ముఖ్యమంత్రులుగా ఉన్నా  ఎప్పుడూ ఇంత పెద్ద సంఖ్యలో బోర్డును నియమించలేదు. ప్రభుత్వంలో ఎవరున్నా సిఎం ఇష్టప్రకారమే ఛైర్మన్, సభ్యుల నియామకం జరుగుతుందన్నది వాస్తవం. కాకపోతే ఒకపుడు ట్రస్టుబోర్డంటే అందరిలోను గౌరవం ఉండేది. రానురాను రాజకీయ జోక్యం పెరిగిపోవటంతో పాటు పూర్తిగా రాజకీయ నాయకులతోనే నిండిపోతుండటంతో ట్రస్టుబోర్డంటే అసలు గౌరవమే లేకుండా పోయింది.

 

నిజానికి ఛైర్మన్, సభ్యులుగా నియమితులయ్యే వారి వల్ల తిరుమల ఆలయం ప్రతిష్ట పెరగాలి. కానీ నియామకాలే రాజకీయ ఒత్తిళ్ళతో జరుగుతుండటంతో ఛైర్మన్ అయినా సభ్యులైనా తమ పదవులను గొప్ప చూపించకోవటం కోసమే ఉపయోగించుకుంటున్నారు. తమ వ్యాపారాలను పెంచుకునేందుకు, పలుకుబడి పెంచుకునేందుకే ఛైర్మన్లు, సభ్యులుగా నియమితులైన వారు తాపత్రయపడుతున్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి.

 

జగన్మోహన్ రెడ్డి తాజాగా నియమించిన బోర్డు చూస్తే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతుంది. నిజానికి ప్రత్యేక ఆహ్వానితులంటూ ఏడుగురిని నియమించాల్సిన అవసరమే లేదు. ఓటింగ్ హక్కు మాత్రం ఉండదట కానీ ప్రోటోకాల్లో ఇతర సభ్యులకున్న మర్యాదలన్నీ అందుతాయట.

 

ఓటుహక్కు లేనపుడు ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించటం ఎందుకు ?  ఇప్పటికే ఎక్స్ అఫీషియో సభ్యులుగా నలుగురున్నారు. ఇంతమందని  ట్రస్టుబోర్డులో నియమించటం వల్ల దేవస్ధానానికి భారం తప్ప ఉపయోగం ఉంటుందని అనుకునేందుకు లేదు. కేవలం రాజకీయంగా వస్తున్న ఒత్తిళ్ళను తట్టుకోలేక ఇలాంటి నియామకాలు జరిపితే చివరకు పలుచనయ్యేది ప్రభుత్వం, దేవస్ధానమే అన్న విషయాన్ని జగన్ గ్రహించాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: