నాలుగు నెలల ముందు జరిగిన ఎన్నికల్లో చారిత్రాత్మక ఓటమిని మూటగట్టుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తప్పు మీద తప్పు చేస్తూ భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. 40 ఏళ్ల ఘన రాజకీయ చరిత్ర కలిగిన ఈ ప్రతిపక్షనేత పరిస్థితుల మీద కనీస అవగాహన లేకుండా ప్రవర్తించడం చాలా విచారకరం. బాబుని ఘోరంగా తిరస్కరించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన పాలన పై తమకున్న ఆగ్రహాన్ని ఓట్లతో చెప్పేశారు. ఆ బాధని ఎలా తగ్గించుకోవాలో తెలియక చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు బయట మాట్లాడుతూ చిన్న అంశంలో తాను బాగా  హైలెట్ అవ్వాలి అని చూస్తూ చివరికి ఎదురు దెబ్బలు తింటున్నారు.

కోడెల ఆత్మహత్య నేపథ్యంలో చంద్రబాబు అధికార పక్షం తో పాటు ఏపీ పోలీసులను కూడా ఫ్రేమ్ లోకి తీసుకుని వచ్చి చాలా పెద్ద తప్పు చేశాడు. ప్రతి విషయాన్ని అధికారపక్షం పైకి నెట్టి వేయడం ఎలాగోలాగా మీడియా అటెన్షన్ పొందేలా చేసుకోవడం బాబు మొదటి నుంచి వేసుకున్న పంథా. అయితే సోషల్ మీడియా పరిధి పెరిగిపోయిన నేపథ్యంలో చిన్న పొరపాటుకి కూడా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని బాబు మర్చి పోతున్నాడు. బాబు చేసిన వ్యాఖ్యలు ఏమిటంటే పోలీసులు ప్రభుత్వానికి అనుకూలంగా మారారని... పోస్టింగులు కోసం వారు ఏ పని చెప్తే ఆ పని చేస్తూ కీలకమైన కేసుల్లో సాక్ష్యాధారాలను తారుమారు చేస్తున్నారు అనే విధంగా ఆయన ఆరోపించారు. 

దీనికి ఏపీ పోలీసుల సంఘం మన మాజీ ముఖ్యమంత్రి మాటలను తీవ్రంగా ఖండించింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ రావు మరియు ప్రధాన కార్యదర్శి ఎం.డి మస్తాన్ ఖాన్ తదితరులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. పోలీసులు పోస్టింగ్ కోసం కక్కుర్తి పడి అధికార పార్టీల నేతలు ఏం చెప్తే అది చేస్తున్నారు అని బాబు మాట్లాడే విధానం సబబుగా లేదని... అది తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉందని వారు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.

పోలీసులు శాంతిభద్రతల కోసం శ్రమిస్తారే తప్ప ఇలా పోస్టింగ్ కోసం కక్కుర్తిపడే రకం కాదని వారు తేల్చి చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి ఈసారి మాట్లాడేటప్పుడు ముందు వెనకా చూసుకొని మాట్లాడడం మంచిదని హెచ్చరించారు. భద్రతలో ముఖ్య పాత్ర పోషించే పోలీసులు ఆగ్రహాన్ని చవి చూడాల్సి రావడం బాబు లాంటి ప్రతిపక్ష నేతలకు ఏమాత్రం మంచిది కాదు. బాబు ఇకనైనా ముందూ వెనకాల చూసుకొని మాట్లాడితే మంచిది అని పలువురు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: