రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, కె చంద్రశేఖర్ రావ్ ఈరోజు హైదరాబాద్ లో భేటీ కాబోతున్నారు. తెలంగాణ సీఎం కేసీయార్ నివాసమైన ప్రగతి భవన్ లో ఈ సమావేశం జరగబోతుంది. సీఎం జగన్ ఈరోజు ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుండి బయలుదేరి 9.50 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడినుండి 10.40 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 11.40 గంటలకు లోటస్ పాండ్ లోని తన నివాసానికి చేరుకుని మధ్యాహ్నం సమయంలో జగన్ కేసీయార్ తో భేటీ అవుతారు. 
 
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ విద్యుత్ బిల్లులు, జలవనరుల సద్వినియోగం, ఇతర పెండింగ్ అంశాలు, ఉద్యోగుల విభజన, తొమ్మిది, పది షెడ్యూళ్లలోని ఆస్తులు అప్పుల పంపకం, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం - 2014లోని పరిష్కారం కాని అంశాల గురించి చర్చిస్తారని తెలుస్తోంది. ఇవి మత్రమే కాక వివిధ అంశాల గురించి చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. 
 
రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు కూడా ఈ చర్చలో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. విభజన చట్టంలోని అంశాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని గతంలో ఇద్దరు సీఎంలు చర్చించటం జరిగింది. గతంలో జరిగిన చర్చలన్నీ సామరస్యపూర్వక వాతావరణంలో జరిగిన నేపథ్యంలో ఈరోజు మరోసారి రెండు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. 
 
రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య అధికారికంగా జరుగుతున్న భేటీ కావటంతో ఈ భేటీపై అందరిలోను ఆసక్తి కనబడుతోంది. ఏపీలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకొనే ధోరణి మొదలయింది. ఈ భేటీ ద్వారా ఇద్దరు సీఎంలు ఇరు రాష్ట్రాలకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకోబోతున్నారని సమాచారం. రేపు ఉదయం జగన్ బేగంపేట్ ఎయిర్ పోర్టు నుండి బయలుదేరి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: