తెలంగాణ పోలీసు కానిస్టేబుల్స్ నియామక పరీక్షలకు అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి కేసీఆర్ కు లెటర్ రాశారు. మెరిట్‌ అభ్యర్దుల జాబితాను , వారికి కటాఫ్‌ మార్కులు విడుదల చేయాలని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి కోరారు. ఫలితాల విడుదలపై స్పష్టత లేక ఐదు నెలలుగా అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారని, ప్రైవేట్‌ హాస్టళ్లలో ఉంటూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని లేఖలో తెలిపారు.


ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని ఆరోపించారు. 90 వేల మంది నిరుద్యోగ యువతకు సంబంధించిన ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ తక్షణమే జోక్యం చేసుకొని కటాఫ్‌ మార్కులు, మెరిట్‌ లిస్ట్‌ విడుదల చేయమని డీజీపీ, బోర్డు చైర్మన్‌లను ఆదేశించాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు.


ఈ లేఖతో తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య లేఖల యుద్ధం మొదలైంది. ఈ లేఖ రాజకీయాలకు సంబంధించింది కాదు.. నిరుద్యోగులకు సంబంధించింది. తెలంగాణలో పోలీసు కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించిన ప్రక్రియ ఏళ్ల తరబడి సాగుతోంది. కానీ ఇంతవరకూ పరీక్షల ఫలితాలు వెల్లడి కాలేదు. వీటికోసం నిరుద్యోగులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.


ఇది ఒక్కరిదో.. ఇద్దరిదో కాదు.. దాదాపు 90 వేల మంది నిరుద్యోగ యువతకు సంబంధించిన ఈ సమస్య. దాదాపు ఏడాది క్రితమే ఫలితాలు విడుదలైనా.. ఇప్పటికీ నియామక ప్రక్రియపై క్లారిటీ రావడం లేదు. ఈ లేఖలో కేటీఆర్ పేరు కూడా రాయడం ద్వారా కేసీఆర్ కుమారుడిని కూడా రేవంత్ రెడ్డి ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించారు. ఆయన ఇటీవలే మంత్రి వర్గంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.


ఓవైపు హుజూర్ నగర్ ఉప ఎన్నికల కాక మొదలైన నేపథ్యంలో కాంగ్రెస్ ఎలాగూ టీఆర్‌ఎస్ పై దూకుడు పెంచే ఆలోచనలోనే ఉంది. ఈ దూకుడుకు ఇలాంటి ప్రజాసమస్యలను వేదికగా ఎంచుకుంటే.. జనం ఆలోచనలో పడే అవకాశం ఉంది. మరి రేవంత్ వ్యూహం ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: