గడచిన కొన్ని రోజులుగా ఉల్లి ధరలు కొండెక్కి కూర్చున్నాయి. వినియోగదారులకు ఉల్లి ధర కన్నీళ్లు తెప్పిస్తోంది. రెండు వారాలుగా ఈ ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ఉల్లి ధరలను తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. మహారాష్ట్ర రాష్ట్రం నుండి ఉల్లిని కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా వినియోగదారులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో కొండెక్కి కూర్చున్న ఉల్లి ధరలు సామాన్యులకు అందుబాటులోకి రాబోతున్నాయి. 
 
అమరావతిలో ఉల్లి ధరలపై మంత్రి మోపిదేవి అధికారులతో సమీక్ష నిర్వహించారు. బ్లాక్ మార్కెట్ కు ఉల్లి తరలింపుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది కావాలని కృత్తిమ కొరత సృష్టిస్తున్నారని అన్నారు. బ్లాక్ మార్కెట్ కు ఉల్లి తరలించే వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి అన్నారు. రెండు రోజుల్లో మహారాష్ట్ర నుండి ఉల్లిని తీసుకొనివచ్చి రైతు బజార్లలో అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ఉల్లి ధరలు పెరగటానికి గల కారణాలను మంత్రికి వివరించారు. 
 
కొన్ని జిల్లాలలో వరదలతో ఉల్లి పంట దెబ్బ తినటంతో ధరలు పెరిగినట్లు అధికారులు చెప్పారు. సామాన్యునికి అందుబాటులో ఉల్లి ధరలు లేకపోవటంతో వైసీపీ ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించిందని సమాచారం. వీలైనంత త్వరగా ఉల్లి ధరలను తగ్గించటానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మహారాష్ట్రలో ఉల్లి లభ్యత ఎక్కువగా ఉందని అధికారులు సూచించటంతో అక్కడినుండి ఉల్లి తెప్పించాలని నిర్ణయం తీసుకున్నారు. 
 
బ్లాక్ మార్కెట్ కు తరలించిన వారిపై అధికారులు సరైన చర్యలు తీసుకోవటం లేదని కూడా మంత్రి సీరియస్ అయ్యారని సమాచారం. జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయంతో సామాన్యులు ఉల్లి కొనుగోలు చేయలేక పడుతున్న ఇబ్బందులు తగ్గే అవకాశం ఉందని చెప్పవచ్చు. 





మరింత సమాచారం తెలుసుకోండి: