కేంద్ర మాజీ మంత్రి,  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు గారపాటి రేణుకా చౌదరి  చట్టాన్ని, న్యాయాన్ని గౌరవిస్తూ ఖమ్మం కోర్టులో హాజరయ్యారు. ఐతే ఆమెపై  గత నెలలో జారీ కాబడిన నాన్ బెయిలబుల్ వారెంట్ ను ఖమ్మం రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఎత్తివేసింది. గతంలో రేణుకా చౌదరిపై నమోదు కాబడిన ఒక ప్రైవేటు కేసుకు సంబంధించి స్పష్టమైన సమాచారం అందలేదు. దానితో  గత నెల 29న ఖమ్మం కోర్టు నాన్ బెయిలబుల్  వారెంట్ జారీ చేసింది. ఈ విషయం తెలిసిన వెంటనే తనకు సమాచారం అందలేదని, కోర్టులో కేసు ఎదుర్కొంటామని రేణుక చౌదరి అప్పట్లో పేర్కొన్నారు.



ఆ కేసుకు సంబంధించి చట్టాన్ని, న్యాయాన్ని గౌరవిస్తూ సోమవారం ఖమ్మం రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో రేణుకా చౌదరి హాజరయ్యారు. కేసు వివరాలు పరిశీలించిన అనంతరం రేణుకా చౌదరిపై గతంలో జారీచేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ ను  న్యాయమూర్తి  ఎత్తివేస్తూ రీ కాల్ చేశారు. వచ్చేనెల 17కు కేసును వాయిదా వేశారు. ఈ సందర్భంగా కోర్టు బయట రేణుకాచౌదరి మీడియాతో మాట్లాడుతూ.. తనపై కొందరు కుట్రపూరితంగా తప్పుడు ఆరోపణలతో ప్రైవేటు కేసు నమోదు చేయించారన్నారు.



ఆ కేసును చట్టపరంగా కోర్టులో ఎదుర్కొంటామని పేర్కొన్నారు. గత నెలలో తనకు సమాచారం అందకుండా, ఇంటి అడ్రస్ సమన్లలో ఇవ్వకుండా కోర్టులను తప్పుదారి పట్టించారన్నారు. సమన్లు తీసుకోలేదు అన్నట్లుగా కుట్రతో వారెంట్ జారీ చేయించారని పేర్కొన్నారు. అయినప్పటికీ చట్టాలను, న్యాయాన్ని, కోర్టులను తాను గౌరవిస్తానని పేర్కొన్నారు. కేసును చట్టపరంగానే ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. కేసును వాదిస్తున్న విష్ణువర్ధన్ రెడ్డి, నిరంజన్  రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కోర్టులు,  చట్టాలను గౌరవించి రేణుకా చౌదరి కోర్టుకు హాజరయ్యారని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: